తాజాగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. తొలి దశలో 21 పదవులను కేటాయించిన సీఎం చంద్రబా బు.. మలి విడతలో 51 వరకు పదవులను వివిధ సామాజిక వర్గాలకు చెందిన కూటమి నాయకులకు పంపిణీ చేసింది. గతం కన్నా ఈ దఫా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడంతోపాటు.. ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన వారికి ప్రాదాన్యం ఇవ్వడం వంటివి సమపాళ్లలో చేసిన నియామకాలుగా భావిస్తున్నారు. దీనిలో ప్రధానంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మాదిగ సంక్షేమ, ఆర్థిక కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ సామాజిక వర్గం మెప్పును పొందారనే చెప్పాలి.
ఇక, కాపు సామాజిక వర్గానికి ఐకాన్‌గా ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఈ దఫా ఊహించని పదవి దక్కింది. ప్రస్తుతం ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన విషయం తెలిసిందే(ఎన్నికలకు ముందు). ఈయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించడం ద్వారా కాపులకు న్యాయం చేసినట్టు.. ముఖ్యంగా జనసేనకు బలమైన నామినేటెడ్ పదవిని అప్పగించినట్టు చర్చ సాగుతోంది. అదేసమయంలో ఎమ్మెల్యేటికెట్‌ను తృటిలో చేజార్చుకుని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మాజీ మంత్రి, యువ నాయకుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్(అరకు) గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గిరీ లభించడంతో ఆ వర్గం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది.
అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇటు మంత్రి పదవుల్లోనూ.. అటు ఇతర పదవుల్లోనూ ప్రాధాన్యం లేకుండా పోయిం దన్న విమర్శలకు చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రముఖ ప్రవచన కర్త, వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న చాగంటి కోటేశ్వర రావుకు.. రాష్ట్ర నైతిక విలువల సలహా దారుగా కేబినెట్ ర్యాంకుతో నియమించడం.. ఆ సామాజిక వర్గంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తేలా చేసింది. వాస్తవానికి బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాదవి మంత్రి పీఠం ఆశించారు. కానీ, కుదరలేదు. ఈ క్రమంలో ఆ వర్గానికి ఐకాన్‌గా ఉన్న చాగంటికి చంద్రబాబు పెద్దపదవే అప్పగించడం గమనార్హం. గతంలోనూ టీడీపీ హయాంలో చాగంటికి సలహాదారు పదవి ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.
విధేయతకు వీరతాడు!
ఇక, టీడీపీ విధేయులకు చంద్రబాబు తాజా నామినేటెడ్ పదవుల్లో వీరతాళ్లు వేశారనే చెప్పాలి. శాసన మండలి మాజీ చైర్మన్ మహ్మద్ షరీఫ్.. టీడీపీ పట్ల, చంద్రబాబు పట్ల అత్యంత విధేయత ప్రదర్శిస్తున్నారు. గతంలో మూడు రాజధానుల బిల్లులను మండలిలో తిరస్కరించడం ద్వారా.. వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ఆ తర్వాత.. కూడా ఆయన పార్టీకి విధేయతగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించారు. అలానే.. పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్న పట్టాభి కొమ్మారెడ్డి, ఆనం వెంకట రమణారెడ్డి, కప్పట్రాళ్ల బొజ్జమ్మ వంటి పలువురుకి కూడా.. చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని మరోసారి నిరూపించినట్టు అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates