సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మాత్రమే కలుసుకుంటారు. వారితోనే నిరంతరం టచ్‌లో ఉంటారు. ఇక, హోం మంత్రిగా ఎవరున్నా.. శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రు ల చేతుల్లోనే ఉంటున్న నేపథ్యంలో డీజీపీలకు హోం మంత్రులకు మధ్య పెద్దగా యాక్సస్ ఉండడం లేదు. దీంతో ముఖ్యమంత్రి తోనే పోలీస్ బాస్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉంటున్నాయి. అది ఏపీ అయినా.. తెలంగాణ అయినా..తమిళనాడు, కర్నాటక అయినా.. ఒకే పద్ధతి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక, డిప్యూటీ సీఎంలతో అయితే.. డీజీపీకి పెద్దగా సంబంధం ఉండదు.
కానీ, అనూహ్యంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌తో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు.. శాంతి భద్రతలు లోపించాయని.. మంత్రి వంగలపూడి అనిత సరిగా పనిచేయడం లేదని డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఆరోపించిన తర్వాత.. అనేక చర్చలు తెరమీదికి వచ్చాయి. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో చెలరేగుతున్న మూకలను కట్టి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డీజీపీ తొలిసారి(ఐదు నెలల కాలంలో) నేరుగా పవన్ కల్యాణ్ ఆఫీసుకు వచ్చి.. ఆయనతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం హోం శాఖలోని కీలకమైన శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉంది. ఇటీవల పవన్ కల్యాణ్ తానే హోం మంత్రి అయితే.. పరిస్థితి చాలి భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలో శాంతి భద్రతల విషయం చర్చకు వచ్చింది. ఈ సమయంలోనే శాంతి భద్రతలను అదనంగా పవన్‌కు ఏమైనా అప్పగించి ఉంటారా? అనేది తాజాగా జరిగిన పరిణామాలను బట్టి.. చర్చకు వస్తోంది. లేకపోతే.. డీజీపీకి., పవన్ చూస్తున్న అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా.. ఆయన వచ్చి కలిశారంటే ఏదో జరిగి ఉంటుందన్నది ప్రధాన చర్చ.
ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియాలో చెలరేగిన వారిని అరెస్టు చేస్తున్నారు. మరో వైపు హైకోర్టు అక్రమ నిర్బంధాలు చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోవైపు.. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో భావ ప్రకటనను అణిచి వేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కోసం డీజీపీ రావడం, ఆయనతో చర్చించడంవంటివి చూస్తే.. రాష్ట్రంలో కీలకమైన శాంతి భద్రత అంశాన్ని చంద్రబాబు నేరుగా పవన్‌కు అప్పగించారా? అనేది ప్రధాన ప్రశ్న. ఏదేమైనా.. ఇప్పుడు జరిగిన భేటీపై మాత్రం రాజకీయ వర్గాల్లోనూ.. ముఖ్యంగా కూటమి పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.