ప‌ద‌వి పోయినా ప‌ట్టు పోలే.. చెవిరెడ్డా.. మ‌జాకా?!

ఆయ‌న వైసీపీ ఫైర్‌బ్రాండ్‌. చంద్ర‌గిరి నుంచి వ‌రుస విజ‌యాలు కూడా అందుకున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్నా.. వైఎస్ కుటుంబం అన్నా చెవి కోసుకుంటారు. ప్రాణం కూడా పెడ‌తారు. ఆయ‌నే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి. అయితే.. ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా, ఆయ‌న కుమారుడు చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే.. ఇద్ద‌రూ కూడా.. కూట‌మి దూకుడు నేప‌థ్యంలో ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రోవైపు.. వైసీపీ ప్ర‌భ కూడా మ‌స‌క బారిపోయింది. జ‌గ‌న్ కుటుంబ వివాదాలు, పార్టీ నుంచి నేత‌ల ప‌యనాలు.. వంటివి వైసీపీకి ప్రాణ సంక‌టంగా మారాయి.

ఇలాంటి స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎంత దూకుడు ఉన్న నాయ‌కులైనా సైలెంట్ అయిపోతారు. ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రు లు కొడాలి నాని వంటివారు సైలెంట్‌గా ఉన్నారు.కానీ, చెవిరెడ్డి మాత్రం అధికారం లేకున్నా.. ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న హ‌వాను ప్ర‌ద‌ర్శించారు. తాజాగా శ‌నివారం ఆయ‌న పుట్టిన రోజు జ‌రిగింది. అయితే.. సాధార‌ణంగా పార్టీ ఓడింది. తండ్రీ త‌న‌యులు కూడా ఓడిపోయారు. దీంతో సాదాసీదాగా ఈ పుట్టిన రోజును నిర్వ‌హించుకుంటార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, చెవిరెడ్డి అధికారంలో లేకున్నా.. త‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో జన్మదిన వేడుకలను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ట‌పాసులు కాల్చి సంద‌డి చేశారు. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. సుమారు 30 వేల మంది నాయ‌కులే హాజ‌ర‌య్యారంటే ఎంత పెద్ద ఎత్తున ఈ వేడుక‌లు జ‌రిగాయో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, కార్య‌క‌ర్త‌లు ల‌క్ష‌ల సంఖ్య‌లో వ‌చ్చి.. నాయ‌కుడిని ముంచెత్తారు.

అంతేకాదు.. అధికారం మారిన త‌ర్వాత‌.. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను క‌న్నెత్తి చూసేందుకు కూడా సాహ‌సించ‌రు. కానీ, చెవిరెడ్డి ఇలాకాలో అలాంటిదేమీ లేదు. ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్ లు అందరూ చెవిరెడ్డి ఇంటికి క్యూ క‌ట్టుకున్నారంటే.. ఆయ‌న‌పై ఉన్న అభిమానం ఎలాంటిదో చెబుతుంది. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ చెవిరెడ్డికి శుభాకాంక్షు చెప్ప‌డం గ‌మ‌నార్హం అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీచులాడుకున్న టీడీపీ ప్ర‌స్తుత ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి నాని స‌తీమ‌ణి కూడా.. చెవిరెడ్డికి శుభాకాంక్షలు చెప్ప‌డం.. మ‌రో విశేషం.