బోరుగడ్డ అనిల్.. దిండు దుప్పటి ఇచ్చి మరీ పడుకోబెట్టారు

జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ ఏ రేంజ్ లో హైలెట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ అండతో హద్దులు దాటిన వారిలో బోరుగడ్డ టాప్ లిస్టులో ఉన్నాడని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగానే కోరుకున్నారు. అతను మాట్లాడిన మాటలకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా ఆశించారు.

అయితే, ప్రస్తుతం ఊహించని సీన్స్ దర్శనమిస్తున్నాయి. అనీల్‌ కస్టడీలో ఉన్న సమయంలో పోలీసులు రాచమర్యాదలు చేయడం కలకలం రేపింది. ఇటీవల గుంటూరు జిల్లా ఆరండల్‌పేట పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న అనీల్‌కు విచారణ సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేషన్‌లో దుప్పట్లు, దిండ్లు సమకూర్చి మరీ పడుకోబెట్టారు. అలాగే అతని బాగోగుల గురించి అడిగిమరి వసతులు కల్పిస్తున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతనికి విశ్రాంతి ఇవ్వడం, కుర్చీలు సమకూర్చడం వంటి సదుపాయాలను కల్పించడం సామాన్య విషయాలు కావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు గన్నవరం వద్ద మరో కేసులో విచారణకు తీసుకువెళ్తున్న సమయంలో కూడా బోరుగడ్డకు బిర్యానీ తినిపించడం, తృప్తిగా అన్నం వడ్డించిన వీడియో కూడా కాంట్రవర్సీకి దారి తీసింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తతంగం రాష్ట్రంలో పోలీసుల తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇక ఇలాంటి వ్యక్తులకు ఇంతలా అండగా వ్యవహరించడంపై అధికారులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పద్దతిలో సామాన్య జనాలకు వసతులనా కల్పిస్తారా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో ప్రభుత్వ వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అతడిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని మరిన్ని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.