ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువును కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, గూగుల్ మ్యాప్స్ లో కూడా చెరువు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా ఉందని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ చెరువు కబ్జా వ్యవహారంలో కేతిరెడ్డికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటీసులపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా స్పందించారు.
ఆ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని కేతిరెడ్డి ఆరోపించారు. ఆ భూములకు అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఈ సమయంలో అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఈ నోటీసులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.
ఆ చెరువు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కేతిరెడ్డి ఆక్రమించారని అధికారులు అంటున్నారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఆ భూములున్నాయని, ఆక్రమించిన భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. అలా చేయకుంటే ఆ స్థలంలోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కేతిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.