రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది సంగతి తెలిసిందే. అలాగే రాజకీయాలో హుందాతనం, గౌరవం కాపాడుకునే ప్రవర్తన కూడా తప్పనిసరి. తాజాగా ఇలాంటి ప్రత్యేకతను, రాజకీయ విశిష్టతను చాటుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనో ఆసక్తికర ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వివిధ వర్గాల వారు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మేరకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని ఈ మేరకు ప్రధాని తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకత చాటుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతారు.
దేవాలయంలో ప్రత్యేక దర్శనం, పూజల అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. 4.30 గంటలకు ధర్మారెడ్డి కాలువ మీదుగా సంగెం-నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారికి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు నాగిరెడ్డిపల్లిలో వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.