ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. శాంతి భద్రతల సమస్యపై హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.
అయితే, పవన్ వ్యాఖ్యలను సూచనలా తీసుకుంటామని అనిత అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో శాంతి భద్రతలపై పవన్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి వైసీపీ తప్పుకుందని పేర్ని నాని చేసిన ప్రకటన సంచలనం రేపింది. కూటమి ప్రభుత్వం హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని, గ్రాడ్యుయేట్ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే అవకాశం లేదని నాని చెప్పారు.
నిష్పక్షపాతంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. పోటీ చేసే అభ్యర్థి… స్వేచ్ఛగా ఓటు అడిగే అవకాశం లేదని, వైసీపీ కార్యకర్తలను ఏ విధంగా వేధిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ కారణాలతోనే ఎన్నికల బరినుంచి తప్పుకున్నామని ప్రకటించారు.
అయితే, ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైందని, 11 సీట్లకే పరిమితమైందని టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న రీతిలో ప్రజాక్షేత్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా లేని వైసీపీ నేతలు ఈ రకంగా శాంతి భద్రతలు అంటూ తమ అసమర్థతను కప్పి పుచ్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates