పాపం వాలంటీర్లు.. పవన్ కీలక వ్యాఖ్యలు

వాలంటీర్ల వ్యవస్థపై రద్దు చేయబోమని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని, వారిని తీసివేసే ప్రసక్తి లేదని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు…అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మౌనం వహిస్తున్నాయి.

ఎన్నికలకు ముందే దాదాపు సగం మంది వాలంటీర్లు రాజీనామా చేయగా రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లకు జీతాలు కూడా పడకుండా ఉన్న వైనం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సర్పంచ్ సంఘాలతో అమరావతిలో భేటీ అయిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ ల విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని, వాలంటీర్లకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఉందని పవన్ చెప్పారు. వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదో సాంకేతిక సమస్య అని, అందుకే అపరిష్కృతంగా ఉందని పవన్ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం పక్కనబెట్టిన కారణాన్ని పవన్ పరోక్షంగా చెప్పేశారు. తాజాగా పవన్ వ్యాఖ్యలతో త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేసే అవకాశముంది.