వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీనివాస్ నివాసంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. లోపల ఉన్నవారిని లోపలే ఉంచేసి.. బయట నుంచి ఎవరూ రాకుండా కాపలా పెట్టి మరీ ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం.
ఒక్క గ్రంధి శ్రీనివాస్ ఇల్లే కాకుండా.. ఆయనకు సంబంధించిన ఆక్వా వ్యాపారాల సముదాయాలు, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు సాగుతున్నాయి. అలానే.. గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామి కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన చెన్ను లక్ష్మణరావు ఇల్లు, వ్యాపార సముదాయంలోనూ దాడులు జరుగుతున్నాయి. అటు గ్రంధి శ్రీనివాస్, ఇటు చెన్ను లక్ష్మణరావుల ఇళ్లపై ఏకకాలంలో అధికారులు దాడులు చేయడం గమనార్హం.
ఇదిలావుంటే, ప్రముఖ రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, వ్యాపార సముదాయాలపై దాడులు జరగడానికి రూ.కోట్లలో ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడమే కారణమని తెలుస్తోంది. పైగా ఎన్నికల అపిడవిట్లో పేర్కొన్న మేరకు.. వ్యాపారాలను కూడా ఐటీ అధికారులు మధింపు చేస్తున్నారు. తనిఖీల సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను నియమించారు.
కృష్ణాజిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపారాల సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తుండడంతో రాజకీయంగా కూడా ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీ నాయకులు అలెర్ట్ అయ్యారు. దీని వెనుక.. రాజకీయ కుట్ర ఉందని పలువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం గ్రంధి శ్రీనివాస్ వ్యవహారం బయటకు రాగానే తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు.