రేవంత్ ను దించే స్కెచ్‌లో ఉత్త‌మ్ బిజీ?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్ట‌వ‌డం!. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని, సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది జూన్ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచ‌ల‌న జోస్యం చెప్పారు. ఏడు సార్లు ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తే కాంగ్రెస్ ముఖ్య నేత‌ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పేర్కొంటూ ప్రియాంక నామినేషన్ కు వెళ్లినా కూడా రాహుల్ దర్శన భాగ్యం దక్కలేదని ఏలేటి చేసిన వాఖ్యలు ఇప్పుడు దుమారం లేపడమే కాకుండా కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. అయితే, దీని వెనుక ఓ నేత ఉన్నాడ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

సీఎంను మారుస్తున్నారనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేఎల్పీ నేత‌గా కాంగ్రెస్ సర్కారు టార్గెట్ గా ఆరోపణలు చేయ‌డంలో, బీజేపీలో ఓవర్ స్పీడ్ గా వెళ్లాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుకోవ‌డంలో వింత ఏమీ లేన‌ప్ప‌టికీ ఏకంగా ఢిల్లీ అధిష్టానం నుంచే సోర్స్ వస్తోందనే చెప్సడం వెనక రీజ‌న్ ఏంట‌నేది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఏలేటికి కాంగ్రెస్ మూలాలు ఉండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ గా వ్యవహరించిన ఏలేటి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. అనంత‌రం ఎమ్మెల్యేగా గెలుపొంది, త‌దుప‌రి పార్టీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఏలేటీకి ఢిల్లీలో గ‌ట్టి సోర్సు ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎస‌రు పెట్ట‌డం చ‌ర్చ‌లో ఇంకో టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి వ‌ర్గాల విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం, ఏలేటి కామెంట్ల వెనుక మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నార‌ట‌. పదేపదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును ఏలేటి తలుస్తుండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య గతంలో అవినాభావ సంబంధాలు ఉండేవని కూడా వారు పేర్కొంటున్నారు. ఏలేటీతో మాట్లాడించేది ఉత్తమ్ కుమార్ రెడ్డే అనే ప్ర‌చారం కూడా సోష‌ల్ మీడియాలో చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర కామెంట్ల‌ను కూడా రేవంత్ రెడ్డి వ‌ర్గం ప్ర‌చారంలో పెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజయ్ ల‌ను ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. తరుచూ చిట్ చాట్ల పేరుతో ఆయన చేస్తున్న ఆరోపణలు దీనికి తార్క‌ణ‌మ‌ని అంటున్నారు. మొత్తంగా నిత్యం ఏదో రకంగా సంచలన వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ మీడియాను తన వైపునకు తిప్పే ప్రయత్నం చేస్తున్న ఏలేటి ఇటు స్వ‌ప‌క్షం అటు ప్ర‌తిప‌క్షంలోనూ హాట్ టాపిక్ అవ‌డం గ‌మ‌నార్హం.