నడిరోడ్డుపై ఉరి తీయిస్తా..చంద్రబాబు వార్నింగ్

ఏపీలో గత కొద్ది రోజులుగా అత్యాచార ఘటనలు, హత్యాచార ఘటనలు జరుగుతున్న వైనం కలచివేస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా, చట్లప్రకారం దోషులకు శిక్షలు పడుతున్నా కామాంధులు మాత్రం కన్నుమిన్ను కానరాకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి మొదలు ముసలివారి వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కామాంధులపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేసిన కిరాతలకులను నడిరోడ్డుపై ఉరి తీయాలని చంద్రబాబు భావోద్వేగంతో స్పందించారు.

తిరుపతి జిల్లా వడమాల మండలం ఎఎంపురం గ్రామంలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచార ఘటన తనను కలిచివేసిందని, అది దారుణ ఘటన అని చంద్రబాబు అన్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇద్దరు, ముగ్గురు నిందితులను నడిరోడ్డుపై ఉరి తీస్తేనే కామాంధులు దారికి వస్తారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంజాయి, మద్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, మహిళలు ఆట వస్తువులు కాదని అన్నారు. ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు అని కామాంధులను హెచ్చరించారు.

ఇక, వడమాలపేట బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. ఇక, ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇక, ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హోం మంత్రి అనిత చెప్పారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారని చెప్పారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించబోతున్నానని అనిత వెల్లడించారు.