తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా అర‌వింద్ గౌడ్‌!

తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు ఆదిశ‌గా వ‌డివ‌డిగానే అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతిలోగా.. పార్టీ ని అన్ని ర‌కాలుగా ముందుకు న‌డిపించే కీల‌క నాయ‌కుల భ‌ర్తీపై ఆయ‌న దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా.. ప్ర‌ధాన‌మైన తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది.

ఏపీలోను, తెలంగాణ‌లోనూ.. రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష‌ ప‌ద‌విని బీసీల‌కు ఇస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు తెలంగాణ‌లో పిలిచి మ‌రీ ప‌ద‌వి కట్ట‌బెట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేయ‌డం లేద‌న్న కార‌ణంతో ఆయ‌న పార్టీకి దూర‌మై.. బీఆర్ ఎస్ కండువా క‌ప్పుకొన్నారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌ద‌విని మ‌రోసారి భ‌ర్తీ చేసేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనూ బీసీనేత‌కే పెద్ద‌పీట వేయాల‌ని చూస్తున్నారు.

వాస్త‌వానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు బాబు మోహన్, జీహెచ్ ఎంసీ మాజీ మేయ‌ర్‌ తీగల క్రిష్ణారెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. రెండ్రోజుల క్రితం టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక‌, ఇప్ప‌టికే పార్టీలో చేరతానని చెప్పిన తీగల కృష్ణారెడ్డి కూడా ఈ ప‌ద‌విని ఆశిస్తున్నారు. అయితే.. చంద్ర‌బాబు మాత్రం బీసీ నాయ‌కుడు అర‌వింద్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం.

త్వ‌ర‌లోనే రాష్ట్రంలో స్థానిక సంస్జ‌లకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బీసీ నాయ‌కుడికి ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయొచ్చ‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా ఉంది. ఇక‌, ఈ ప‌ద‌విని ఆశిస్తున్న‌వారిలో తీగ‌ల కృష్ణారెడ్డి(ఇంకా చేర‌లేదు)కి ఉపాధ్య ప‌ద‌విని, బాబూ మోహ‌న్‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ఇచ్చే యోచ‌న ఉంద‌ని తాజాగా తెలిసింది. దీపావ‌ళి సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఈ విష‌యంపై సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేశార‌ని.. పేర్ల‌ను ఫైనల్ చేశార‌ని స‌మాచారం.