జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్వీఎస్ ఎస్ వర్మకు చంద్రబాబు నుంచి ఇంకా ఎలాంటి అనుగ్రహం లభించకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకు కీలకమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయం దక్కించుకున్నారు. కానీ, వర్మకు మాత్రం ఎలాంటి పదవీ దక్కలేదు.
ఇది.. పైకి చెక్కపోయినా.. ఇటు టీడీపీలోను.. అటు జనసేనలోనూ తరచుగా చర్చకు వస్తున్న విషయం. వర్మ గారిని మరిచిపోయారా? అంటూ.. పిఠాపురం నాయకులు(ఆయనపట్ల విధేయతతో ఉన్నవారు) కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఎమ్మెల్సీలను నియమించారు. నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కీలకమైన టీటీడీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజుల్లో మరో 40 దాకా.. నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన పేరు వినిపించలేదు. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. వర్మ విషయంలో లెక్కలు సరిపోవడం లేదా? అనేది కూటమి నేతల మధ్య జరుగుతున్న చర్చ. అయితే.. రాజకీయ విశ్లేషకులు మరో మాట చెబుతున్నారు. అసలుచాలా చిక్కుల్లో ఉన్నారన్నదివారి మాట. వర్మ విషయంలో కొందరు నాయకులు తెరచాటున అడ్డు తగులుతున్నారని వారు చెబుతున్నారు.
వారిలో కీలకమైన జనసేన నాయకుడు చక్రం తిప్పుతున్నారన్న వాదనా ఉంది. వర్మకు ఏ చిన్న పదవి ఇచ్చినా.. రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయన్నది వారి సమస్య. ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టినా.. పెట్టకపోయినా.. తెరచాటున జరుగుతున్న రాజకీయ చర్చ అయితే.. మొత్తంగా ఇదేనన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవన్నీ సమసిపోయి.. వర్మకు పదవి రావడం.. అంటే.. కనీసంలో కనీసం.. ఆరు మాసాలైనా ఆగకతప్పదన్నది వారి మాట. ఏదేమైనా.. రాజకీయాలు ఇంతే!!
Gulte Telugu Telugu Political and Movie News Updates