ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా భేటీ అయ్యారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల పైనే ఎక్కు వగా దృష్టి పెట్టే రామ్ దేవ్ బాబా.. 2016 తర్వాత.. మళ్లీ ఏపీపై ఇప్పుడే దృష్టి పెట్టారు. 2016-17 మధ్య రాజధాని అమరావతిలో ఆయన యోగా శిబిరాలు నిర్వహించారు. అప్పట్లో జూన్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించగా.. సీఎం చంద్రబాబుతో యోగా గురువు రాం దేవ్ బాబా యోగాసనాలు కూడా వేయించారు. ఇలా.. అప్పట్లో అమరావతిలో యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
కానీ, ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. ఇంతలో ప్రభుత్వం మారిపోయి.. వైసీపీ వచ్చాక అసలు అమరావతిని పట్టించుకోలేదు. ఈ సుదీర్ఘ విరామం అనంతరం.. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక.. మరోసారి రామ్ దేవ్ బాబా.. సీఎం చంద్రబాబు చెంతకు రావడం గమనార్హం. అమరావతిలోని సచివాలయానికి వచ్చిన బాబా రాందేవ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగానే ఇరువురి మధ్య చర్చ సాగింది. తొలుత చంద్రబాబుకు రామ్ దేవ్ బాబా బంగారంతో కూడిన తలసి మాలను బహూకరించారు. చంద్రబాబు ఆయనకు శాలువా కప్పి.. అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌ను అందించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామ్ దేవ్ బాబా చెప్పారు. వ్యవసాయం, పంట తోటలు, ఉద్యాన తోటలకు సంబందించి పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. అదేవిధంగా అమరావతిని ప్రపంచ యోగా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఆయుర్వేద వైద్యంలో ప్రజలకు సేవ చేయనున్నట్టు తెలిపారు. అలానే ఆహార తయారీ, విద్యారంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు. రామ్ దేవ్ బాబా విన్నపాలకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తన ట్విట్టర్‌లోనూ పేర్కొన్నారు.