అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ అలైన్స్ సినర్జీ సమ్మిట్-2024’’లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సదస్సులో లోకేష్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లో కొనసాగవద్దు అని తన భార్య బ్రాహ్మణి తనతో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు.
రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులుంటాయని, అవసరమా అని బ్రాహ్మణి తనను చాలాసార్లు అడిగిందని, ప్రత్యేకించి చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కుటుంబం బాగా ఇబ్బంది పడిన సమయంలో బ్రాహ్మణి, తాను చాలా ఆవేదన చెందామని చెప్పారు. కానీ, హైదరాబాద్ లో 45 వేల మంది ఐటీ ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా బాబు గారికి మద్దతుగా నిలిచారని, అది చూసిన తర్వాత బ్రాహ్మణి తాను రాజకీయాలలో కొనసాగడం గురించి ప్రశ్నించలేదని అన్నారు.
ఇక, అమెరికాలోని పలు నగరాల్లో చాలామంది ఎన్నారైలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం, ప్రజల కోసం ఇంత త్యాగం చేశాం అయినా అక్రమ అరెస్టులు తప్పలేదు…అని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేసిందని, కానీ, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి వస్తున్న మద్దతు చూసి తన నిర్ణయం మార్చుకుందని అన్నారు.
45 ఏళ్ళు ప్రజల కోసమే పని చేసిన చంద్రబాబు గారిని, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రజలందరూ చంద్రబాబు గారి కోసం నిలబడిన తీరు చూసిన తర్వాత తమ కుటుంబం ఆ అభిప్రాయం మార్చుకుందని చెప్పారు. కష్టాల్లో చంద్రబాబు గారి కోసం నిలబడ్డ ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని అన్నారు.