వైసీపీ అధినేత జగన్ సహజంగా తన సొంత జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు.. స్థానిక నాయకులు తండోప తండాలుగా వస్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కామన్‌గా జరిగేదే. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు. జగన్ బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సొంత జిల్లా కడపలోని ఇడుపులపా యకు చేరుకున్నారు. అనంతరం… తమ సొంత ఎస్టేట్‌కు వెళ్లారు. ఈ విషయంపై గత రెండు రోజులుగా ఇక్కడ ప్రచారంలో ఉంది.
దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు వస్తారన్న ఉద్దేశంతో ముందుగానే జిల్లా ఎస్పీకి కూడా జగన్ భద్రతా సిబ్బంది సమాచారం చేరవేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని కూడా కోరారు. దీంతో పెద్ద ఎత్తున భద్రతను కల్పించారు. కానీ, భద్రతకు వచ్చిన పోలీసుల సంఖ్యలో కూడా.. నాయకులు, కార్యకర్తలు రాకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ నాయకులు అవాక్కయ్యారు.
ఇదిలావుంటే.. సొంత జిల్లాలో పర్యటిస్తున్న జగన్‌కు.. పొరుగు జిల్లాలకు చెందిన నాయకులు వచ్చి.. స్వాగతం పలకడం.. వారే పుష్పగుచ్ఛాలు అందించడం గమనార్హం. గుంటూరుకు చెందిన నాయకులు, ఎక్కడో విశాఖకు చెందిన నాయకులు కడపలో దర్శనమిచ్చారు. స్థానికంగా ఉన్న నాయకులుపలచగా కనిపించారు. మరీ ముఖ్యంగా సొంత కుటుంబానికి చెందిన నాయకులే కనిపించకపోవడం గమనార్హం.
అయితే.. వీరంతా వేరే కార్యక్రమాల్లో ఉన్నారని పార్టీలో చర్చసాగుతోంది. ఏదేమైనా.. షర్మిలతో ఆస్తి వివాదాలు రాజుకున్న సమయంలో సొంత జిల్లాలో ఇలా కేడర్, నాయకులు పలుచన కావడం చర్చకు దారితీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates