వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదంలో పెద్ద సంఘటన తాజాగా తెరమీదికి వచ్చింది. ఈ ఆస్తుల వివాదంలో ఇప్పటి వరకు షర్మిల చెబుతున్నది, అటు జగన్ చెబుతన్నది.. ఇద్దరి పక్షాన అనుకూల, ప్రతికూల వర్గాలు చెబుతున్నది కూడా.. పెద్ద గందరగోళానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందరూ అనుకున్నట్టుగానే.. కొద్దిపాటి ఆలస్యంతో అయినా.. విజయమ్మ స్పందించారు. ఈ సందర్భంగా అసలు ఏం జరిగిందనేది ఆమె చెప్పుకొచ్చారు. దీంతో అసలు వివాదానికి దాదాపు ముగింపు పలికినట్టయింది.
అయితే.. ఈ క్రమంలో విజయమ్మ ఎవరి వైపు నిలబడ్డారనేది రాజకీయ నేతల నుంచి నెటిజన్ల వరకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరి చారు. సహజంగానే ఈ ప్రశ్న ఉద్భవిస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో షర్మిలకు అనుకూలంగా విజయమ్మ స్పందించి.. అమెరికా నుంచి కూడా వీడియో సందేశం పంపించారు.
దీంతో ఆమె పక్షానే షర్మిల మాట్లాడే అవకాశం ఉంటుందని భావించిన వారు ఉన్నారు. అలాకాదు.. జగన్ చెబుతున్నట్టు ఆమె కూడా.. చెబుతారని అన్నవారు కూడా వైసీపీలో ఉన్నారు. మొత్తానికి విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
తాజాగా రాసిన బహిరంగ లేఖలో విజయమ్మ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. అయితే.. ఆమె ఎవరి పక్షమో నిలబడకుండా.. కుటుంబ పక్షానే నిలిచారని స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరూ బిడ్డలూ సమానం అని చెప్పిన ఆమె.. ఇరువురి పక్షానా వకాల్తా పుచ్చుకున్నారు.
ఈ విషయంలో వేలు పెట్టిన పెద్దలపైనా.. ఈ క్రమంలో వారు చెప్పిన సుద్దులపైనే విజయమ్మ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ ఉన్నప్పుడు ఆస్తులు పంపకాలు జరిగిపోయాయన్న వాదన ఇప్పుడు పటాపంచలు అయిపోయింది. అలా అప్పట్లో జరగలేదని, ఆస్తులు సమానంగా పంచాలని అనుకున్న సమయంలోనే ఆయన మృతి చెందారని విజయమ్మ చెప్పడం ద్వారా.. పెద్ద ప్రశ్నకు అంతే పెద్ద సమాధానం వచ్చినట్టయింది.
ఇక, ఇద్దరూ బిడ్డలూ తనకు సమానమని చెప్పిన విజయమ్మ.. పాపకు అన్యాయం జరిగిందని చెప్పడం ద్వారా.. నిజంవైపు నిలబడ్డారనే వాదన వినిపించారు. అదేవిధంగా 200 కోట్లరూపాయల డివిడెండును అన్న ప్రేమతో చెల్లికి ఇచ్చారన్న వాదనను కూడా తోసిపుచ్చారు.
ఇది ఆమెకు రావాల్సిన వాటానేనని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆస్తులు ఇంకా పంచుకోలేదని చెప్పడం ద్వారా.. ఆస్తుల వివాదం నిజమేనని నిర్దిష్టంగా తేల్చేశారు. రాజకీయాల్లో జగన్ కనుసన్నల్లోనే పాప(షర్మిల) నడిచిందని చెప్పడం ద్వారా.. రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య వివాదాలు లేవని విజయమ్మ తీర్మానించినట్టు అయింది. మొత్తంగా చూస్తే.. విజయమ్మ.. ఎవరి పక్షమూ కాకుండా.. వైఎస్ కుటుంబం పక్షానే నిలబడ్డారనేది ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates