మీరు చదివింది కరెక్టే. ఇలా అన్నది ఎవరో విదేశీయుడు.. మన రాష్ట్రంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తో కాదు. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ తరఫున బలమైన గళం వినిపించి.. ఎవరినిబడితే .. వారిని నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి.. జగన్ కోసం నిలబడిన వైసీపీసానుభూతి పరుడు.. బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయనే స్వయంగా “జగన్ అంటే.. వైఎస్ కొడుకేనా?.. నాకు తెలియదు. మావోళ్లు అప్పుడప్పు డు చెబుతారు. ఇంతకన్నా నన్నేమీ అడగొద్దు!” అని పోలీసులకు నిఖార్సుగా తేల్చి చెప్పారు.
ఇంతకీ బోరు గడ్డ అనిల్ ఎవరు? అంటే.. అమరావతి ప్రాంతానికి ప్రాంతానికి చెందిన వివాదాస్పద యూ ట్యూబర్. సోషల్ మీడియాలో నోరు చేసుకోవడంలోనూ.. జగన్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడంలోనూ సిద్ధహస్తుడు. ముఖ్యంగా జగన్‌నుఎవరైనా ఏదైనా అంటే.. ఖస్సున తాచుపాము లేచినట్టు లేచే బోరుగడ్డ.. అనేక వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, నారా లోకేష్, రఘురామకృష్ణరాజు సహా వైసీపీ మాజీ నాయకులను కూడా టార్గెట్ చేసుకున్నారు.
అయితే.. ఇప్పుడు ఆయన పాపం పండి.. బాబు ప్రకాష్ అనే వ్యక్తి పెట్టిన కేసులో(50 లక్షలు డిమాండ్ చేశారని) అరెస్టయి.. ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. గతంలో ఉన్న ఆరోపణలు, ప్రస్తుత సీఎం , డిప్యూటీ సీఎంలపై గతంలో చేసిన వ్యాఖ్యలు, దూషణల అంశాన్ని కూడా.. ఆయన నుంచి విచారించే ప్రయత్నం చేశారు. “జగన్ పై అభిమానంతోనే ఇలా చేసేవా?” అన్న ప్రశ్నకు.. జగన్ అంటే.. ఎవరు? నాకు తెలీదు. వైఎస్ కొడుకేనా? అని ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు అవాక్కయ్యా రు.
ఎన్ని సార్లు గత సంగతులను ప్రశ్నించినా.. అనిల్ ఇలానే సమాధానం చెప్పడం గమనార్హం. ఇక, లాభం లేదని భావించిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడంతో గుంటూరు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దీంతో మరోసారి ఆయనకు కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ. ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో బోరుగడ్డ అనిల్ నవంబరు 12 వరకు రిమాండ్ లో ఉండనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates