కూటమి పార్టీల నాయకులు కలివిడిగా ఉండాలని.. నాయకులు కలిసిమెలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కలివిడితనం లేకపోతే.. ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కి.. రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినా.. చంద్రబాబు, పవన్‌లు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీనికి కారణం.. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నాయకుల మధ్య కలివిడి లేకపోవడమే. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాల తర్వాత.. ఈ తరహా పరిస్తితి మరింత పెరిగింది.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన దెందులూరు నియోజవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య ఒకరకమైన ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి టీడీపీ నేత సైదు గోవర్ధన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయంగా రగడకు దారి తీసింది. స్థానిక నాయకులు సర్ది చెప్పినా గోవర్ధన్ వినిపించుకోలేదు. మళ్లీ మళ్లీ అవే వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు జనసేన నాయకులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు రెడీ అయ్యారు.
ఇక, ఒంగోలులోనూ టీడీపీ నాయకులు.. జనసేనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమను సంప్రదించకుండానే వైసీపీ నేతలను పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రతిగా.. జనసేన నాయకులు.. మరో స్టెప్ ముందుకు వేసి.. మీరు తీసుకున్ననాయకుల గురించి మాకు చెబుతున్నారా? అంటూ.. నిలదీస్తున్నారు. దీంతో కలివిడిపోయి.. విడివిడి రాజకీయమే ఇక్కడ కూడా దర్శన మిచ్చింది. మరీ చిత్రంగా అనంతపురం అర్బన్ రాజకీయం తయారైంది. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ ఆ పార్టీ సీనియర్ నేత, టికెట్ త్యాగం చేసిన నాయకుడికి మధ్య కూడా మరో సరికొత్త రగడ తెరమీదికి వచ్చింది.
తన హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయానని..ఇప్పుడు వాటిని సరిచేయాలని మాజీ ఎమ్మెల్యే అధికారులను కోరుతున్నారు. కానీ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆయా పనులు వద్దన్నట్టుగా అధికారులు తేల్చి చెబుతున్నారు. అంటే.. ఇక్కడ టీడీపీలోనే రెండు కుంపట్లు తయారయ్యాయి. మరోవైపు.. ఇదే జిల్లాలోని ధర్మవరంలో బీజేపీ పై పైచేయి కోసం.. జనసేన, ఈ పార్టీపై పైచేయి కోసం.. టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికారులు నలిగిపోతున్నారు. ఎవరి మాట వినాలో తెలియక.. తలలు పట్టుకుంటున్నారు. ఇలా.. అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి కలివిడి పోయి.. విడివిడి అనే మాట వినిపించేలా చేస్తోంది. చంద్రబాబు తక్షణం వారిని సరిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.