ఎక్కడో ఏదో జిల్లాలో రాజకీయంగా ఇబ్బంది వస్తే.. వేరే సంగతి. కానీ, సొంత జిల్లా.. పైగా.. పార్టీ పరంగా నాయకత్వం పరంగా కూడా.. బలంగా ఉన్న జిల్లాలో ఇప్పుడు కూసాలు కదిలిపోతున్న పరిస్థితి ఏర్పడితే.. ఎవరైనా ఏం చేస్తారు? అక్కడే తిష్ట వేస్తారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా అదే చేస్తున్నారు. తన సొంత జిల్లా కడపలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ఇదేదో.. సరదా కోసం.. కాలక్షేపం కోసం కాదు. చాలా వ్యూహాత్మక విషయాలకోసమే ఆయన కడపలో బస చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
1) కడపలోని బద్వేల్ సహా.. కడప, కమలాపురం నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. కానీ, ఇప్పుడు వాటిలో కమలాపురం కూటమి పార్టీల వశమైంది. ఈ పరిణామాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఫలితం అయితే దక్కలేదు. ఇక, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ.. జనసేన వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమావేశానికి కూడా సుధ గైర్హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ఆమెనుకూడా లైన్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా స్థానిక సంస్థలను పార్టీకి అనుకూలంగా మార్చుకునే బాధ్యత కూడా ఏర్పడింది.
2) షర్మిల వివాదం అనంతరం.. స్థానికంగా ఉన్న వైఎస్ కటుంబం ఎటు నిలబడాలన్న విషయంపై తర్జన భర్జన వచ్చింది. కొందరు మాత్రమే జగన్‌కు అనుకూలంగా ఉన్నారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు ఇలాంటి సమయంలో తటస్థులను కూడా.. తనవైపు తిప్పుకొనేందుకు జగన్ ఈ కడప టూర్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బెంగళూరు నుంచి నేరుగా ఆయన కడపకు చేరుకుంటారు. వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం.. స్థానిక నాయకులతో భేటీ అవుతారు. పార్టీ పరిస్తితిపై చర్చించనున్నారు.
3) మూడో కీలక విషయం.. ఎన్నికల అనంతరం.. ఒకే ఒక్కసారి జగన్.. పులివెందులలో పర్యటించారు. ఆ తర్వాత.. తన సొంత పనులపై వెళ్లారే తప్ప. ప్రజలను కలుసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలను కలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. నాలుగు రోజుల కడప పర్యటనలో రెండు రోజుల పాటు.. పులివెందుల ప్రజలకు జగన్ అందుబాటులో ఉంటారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అదేవిధంగా బద్వేల్‌లో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కూడా జగన్ మరోసారి పరామర్శించనున్నారు. దీపావళి పండుగను తొలిసారి పదేళ్ల తర్వాత.. పులివెందులలో జగన్ నిర్వహించుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates