వైసీపీ వేస్ట్ పార్టీ.. మ‌న‌మే దూకుడు పెంచుదాం: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల విజ‌య‌వాడ‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ సీనియ‌ర్లు, ఇత‌ర నాయ‌కుల‌తో సోమవారం భేటీ అయ్యారు. గ‌త ప‌ది రోజులుగా సాగుతున్న ఆస్తుల వివాదాలు, రాజ‌కీయ ర‌చ్చ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గాడి త‌ప్పుతున్నార‌న్న సంకేతాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అధిష్టానం హెచ్చ‌రిక‌లు చేయ‌క‌ముందే.. ష‌ర్మిల అలెర్ట్ అయ్యారు. పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే నెల నుంచి రాష్ట్రంలో క్షేత్ర‌స్తాయి ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించ‌ను న్న‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిపై పోరాటాలు చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

ఈ క్ర‌మంలో వైసీపీపై ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘వైసీపీ వేస్ట్ పార్టీ. అది ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు ప్ర‌జ‌ల ఆశ‌ల‌న్నీ.. మ‌న‌మీదేఉన్నాయి’ అని ష‌ర్మిల పేర్కొన్నారు. వైసీపీపై ఎన్నో ఆకాంక్ష‌ల‌తో 2019లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని.. కానీ, ఆ నాయ‌కులు దోచుకుని దాచుకోవ‌డంలోనే బిజీ అయ్యార‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. అందుకే ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించి చెత్త బుట్ట‌లో ప‌డేశార‌ని చెప్పారు.

‘ఒక్క‌రంటే ఒక్క‌రికి కూడా నిబ‌ద్ధ‌త లేదు. ఆ పార్టీ ఆద‌ర‌ణ కోల్పోయింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నెర‌వేర్చ‌లేదు. అందుకే సామాన్యులు కూడా తిట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది మ‌నం అందిపుచ్చుకుని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ప్రాదాన్యం ఇద్దాం. వారి త‌ర‌ఫున పోరాటాలు చేద్దాం’ అని ష‌ర్మిల పేర్కొన్నారు. వ‌చ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు ష‌ర్మిల పేర్కొన్నారు. ఎక్క‌డ ఏస‌మ‌స్య వ‌చ్చినా.. వెంట‌నే స్పందించాల‌న్నారు. త‌న దృష్టికి తీసుకువ‌స్తే.. దానిపై అంద‌రూ ఉమ్మ‌డి పోరాటాల‌కు దిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఇండియా కూట‌మిలో ఉన్న సీపీఐ, సీపీఎం త‌దిత‌ర పార్టీల‌తో క‌లిసి ఉద్య‌మాలు నిర్మించేందుకు కూడా సిద్ధంగా ఉండాల‌ని నాయ‌కుల‌కు ష‌ర్మిల పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటిని స‌ద్వినియోగం చేసుకుందామ‌ని ష‌ర్మిల చెప్పారు. స‌మ‌స్యల ప‌రిష్కారం, అదేవిధంగా ప్ర‌జ‌ల‌కు భరోసా నింపే విధంగా కార్యక్రమాలు ఉండాల‌ని.. ఆ ర‌కంగా ప్లాన్ చేయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆమె సూచించారు.