రాక్ష‌స క్రీడ‌: సీఎం రేవంత్‌పై కేటీఆర్ కామెంట్స్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్ర‌కారం) వ్య‌వ‌హారం తీవ్ర ర‌గ‌డ‌కు దారి తీసింది. రేవ్ పార్టీ అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌పై మాజీ సీఎం కేసీఆర్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ్ పాకాల హైకోర్టును ఆశ్ర‌యించ‌డం.. ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తుండ‌డం కూడా తెలిసిందే. మ‌రోవైపు ఈ కేసులో కొకైన్ తీసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విజ‌య్ త‌న‌పై పోలీసులు అక్ర‌మ కేసు పెట్టార‌ని యూటర్న్ తీసుకున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స‌ర్కారు మాత్రం మౌనంగా ఉంది. దీనిపై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇదిలావుంటే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ స‌ర్కారు తీరుపైనా.. సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిపైనా నిప్పులు చెరిగారు. రాజ‌కీయాల్లో రాక్ష‌స క్రీడ‌లు ఆడుతున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. త‌మ‌ను ఏదో ఒక‌ర‌కంగా ఇరికించేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని దావ‌త్ ఇస్తే త‌ప్పా? అని నిల‌దీశారు.

దీనిలో ఏదో బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైన‌ట్టుగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న‌ది ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌. త‌మ‌పై రాజ‌కీయాలు చేయ‌డం మానుకుని.. రైతుల‌ను ఆదుకోవాల‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ టార్గెట్‌ రాజకీయాలపై చూపిస్తున్న శ్రద్ధ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల‌న్న అంశంపై ఎందుకు చూపించరని ఆయ‌న స‌ర్కారును ప్ర‌శ్నించారు. అన్న‌దాత‌ల ప‌ట్ల ఎందుకు అంత నిర్ల‌క్ష్యం అని ప్ర‌శ్నించారు.

రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రోజుల త‌ర‌బ‌డి వేచి చూస్తున్నార‌ని చెప్పారు. ఆ దిశ‌గా ప్ర‌భుత్వం దృష్టి పెట్టాల‌ని.. రేవ్ పార్టీల పేరుతో రేయింబ‌వ‌ళ్లు త‌మ‌ను వెంటాడ‌డం మానుకోవాల‌ని వ్యాఖ్యానించారు.