నారా లోకేష్ ఎంట్రీ.. డ్రైవర్ కథ సుఖాంతం

ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రీల్స్‌ మోజులో పడుతున్నారు. తమలో దాగి ఉన్న నైపుణ్యాలను చాటేందుకు దీన్ని వేదికగా చేసుకుంటున్నారు. మామూలుగా బిడియస్తులుగా కనిపించే వ్యక్తులు కూడా రీల్స్, షార్ట్స్‌లో రెచ్చిపోవడం చూసి ఆశ్చర్యపోతుంటాం.

తాజాగా ఒక ఏపీ ఆర్టీసీ డ్రైవర్ విధుల్లో ఉండగా తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. కానీ ఆ వీడియో వైరల్ కావడంతో అధికారుల వరకు వెళ్లి సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఉద్యోగం నుంచే తప్పించేయడంతో లబోదిబోమనడం డ్రైవర్ వంతయ్యింది. కాకపోతే ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టిలో పడడం.. ఆయనకు వీడియో నచ్చి డ్రైవర్‌ను అభినందించడం.. తర్వాత సస్పెన్షన్ గురించి తెలిసి ఆ ఉత్తర్వులు రద్దు చేయించడం.. ఇలా మొత్తానికి కథ సుఖాంతమైంది. సోషల్ మీడియాలో ఈ విషయంలో చర్చనీయాంశంగా మారింది.

కాకినాడ జిల్లాలోని తుని నుంచి ఓ గ్రామీణ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్.. బస్సును మధ్యలో ‘దేవర’ సినిమాలోని దావూదిరే పాటకు అదిరిపోయేలా స్టెప్పులేశాడు. దీన్ని చాలామంది సరదాగానే తీసుకున్నారు కానీ.. విధుల్లో ఉండగా బస్సును ఆపి డ్రైవర్ డ్సెస్సులోనే డ్యాన్స్ వేయడం ఏంటనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఐతే ముగ్గురు పిల్లల తండ్రినైన తాను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలా బతకాలంటూ ఆ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ బస్సు కంటే ట్రాక్టర్ ఇరుక్కుపోవడంతో బస్సును కాసేపు ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి తలెత్తిందని.. ఆ సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు పాటలు పెట్టి డ్యాన్స్ చేయమంటే సరదాగా అలా చేశానని ఆ డ్రైవర్ చెప్పాడు. ఐతే సస్పెన్షన్ గురించి తెలియని మంత్రి నారా లోకేష్.. వైరల్ అయిన డ్యాన్స్ వీడియో మీద ట్విట్టర్లో సరదాగా స్పందించారు. కీపిటప్ అని డ్రైవర్‌ను అభినందించారు. కానీ తర్వాత సస్పెన్షన్ గురించి మరో నెటిజన్ పోస్టు పెట్టగా.. ఆ ఉత్తర్వులు రద్దు చేయిస్తున్నట్లు నారా లోకేష్ చెప్పడంతో కథ సుఖాంతమైంది.