ప్ర‌జ‌ల త‌ర‌ఫునే ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నా: ప్ర‌కాష్‌రాజ్‌

త‌ర‌చుగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌.. మ‌రోసారి ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఏబీపీ స‌ద‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్‌లో పాల్గొన్న ఆయ‌న‌.. ప‌వ‌న్‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఫ‌ర్వాలేద‌ని.. కానీ, ఆ పార్టీ కౌగిలిలో చిక్కుకుపోతున్నార‌ని అన్నారు. ఇలా చిక్కుకుపోయిన ఏ పార్టీ కూడా.. బతికి బ‌ట్ట క‌ట్ట‌లేద‌న్నారు.

ఇదే విష‌యాన్ని తాను చెబుతున్నాన‌న్నారు. గ‌తంలో అయోధ్య‌ను రాజ‌కీయం చేసిన బీజేపీ.. అక్క‌డ ఓడిపోయిన విష‌యం తెలిసిందేన‌న్న ప్ర‌కాష్‌రాజ్‌.. ఇప్పుడు తిరుమ‌ల‌ను కూడా వాడుకుంటోంద‌ని, దీనికి ప‌వ‌న్‌ను వాడుకుంటున్న‌ట్టు స్ఫ‌ష్టంగా తెలుస్తోంద‌న్నారు. ఇది ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన ప‌వ‌న్‌కు స‌మంజ‌సంగా లేద‌న్నారు. అందుకే ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాను ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్టు చెప్పారు. కానీ, త‌న‌పై ఎదురు దాడి చేయిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌శ్నించేందుకు ద‌మ్ము లేక‌పోతే.. రాజ‌కీయాల్లో ఉండ‌డం వ్య‌ర్థం అని ప్ర‌కాష్ రాజ్ చెప్పారు. తాను ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌న్నారు. దేశంలో భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అంటే.. పొగ‌డ‌డం.. పొగిడించుకోవ‌డం ఇచ్చిన హ‌క్కుకాద‌ని.. ప్ర‌శ్నించేందుకు కూడా హ‌క్కు ఉంద‌న్నారు. తాను ఈ ప‌నిని ప్ర‌జ‌ల త‌ర‌ఫునే చేస్తున్న‌ట్టు చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయంగా ఇంకా ప‌రిణితి చెందాల్సి ఉంద‌న్నారు. తాను చేస్తున్న త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తే.. ఆవేశ ప‌డే నాయ‌కుడు ఎద‌గ‌లేడ‌ని చెప్పారు.

ఇక‌, త‌న‌కు సినిమా అవ‌కాశాలు త‌గ్గాయన్న వాద‌న‌లో ప‌స‌లేద‌న్నారు. త‌నను ఆద‌రించే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఉన్నార‌ని.. ప్రేక్ష‌కులు ఉండ‌బ‌ట్టే త‌న‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు.