అంద‌రి చూపూ భార‌తి వైపు.. రీజ‌నేంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజ‌కీయ ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త వారం ప‌ది రోజులుగా ఈ చ‌ర్చ జోరుగా సాగుతూనే ఉంది.

అంతేకాదు.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాటల దాడులు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు అటు జ‌గ‌న్‌, ఇటు ష‌ర్మిల త‌ప్ప‌.. ప్ర‌ధానంగా కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ కూడా.. మీడియా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి చుట్టూ కూడా క‌థ న‌డుస్తోంది.

భార‌తి సిమెంట్స్‌, సాక్షి, స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ వంటి సంస్థ‌ల్లో భార‌తి బోర్డు డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. సాక్షికి ఆమె ఏకంగా చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భార‌తి సిమెంట్స్‌లో పూర్తి గుత్తాధిప‌త్యం కూడా ఆమెదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఆస్తుల వివాదంపైనే తాజాగా ష‌ర్మిల రియాక్ట్ అయ్యారు. త‌న‌కు కూడా వాటాలు ఉన్నాయ‌ని.. న‌లుగురు మ‌న‌వ‌ళ్ల‌కు కూడా స‌మానంగా పంచాల‌ని వైఎస్ చెప్పార‌ని ఆమె చెబుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో భార‌తి ఎందుకు మౌనంగా ఉన్నార‌నేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఆమెకు అనుకూలంగా కొన్ని సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ సాగుతుండ‌గా.. వ్య‌తిరేకంగా మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల్లోనూ చ‌ర్చ వ‌స్తోంది. దీంతో అస‌లు వాస్త‌వం ఏంటి? భార‌తి వ్య‌వ‌హారం ఏంటి? అనేది చ‌ర్చ‌నీయాంశంగానే ఉంది. ఈ క్ర‌మంలో భార‌తి వైపు అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. ఆమె నోరు విప్పితే బాగుంటుంద‌ని.. మెజారిటీ రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయంగా ఉంది.

అంతేకాదు.. ఏం జ‌రిగిందో ధ‌ర్డ్ ప‌ర్స‌న్‌గా కంటే కూడా.. ఆమె వైఎస్ కోడ‌లిగా.. మీడియా ముందుకు వ‌స్తే.. ఈ స‌మ‌స్య‌కు కొంత ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తి నోరు విప్ప‌డం లేదు. మీడియా ముందుకు కూడా రాలేదు. మ‌రి ఆమె ఏమ‌నుకుంటున్నారు? అనేది కీల‌కంగా మారింది. ఇంటి గుట్టు బ‌య‌ట పెట్ట‌రాద‌ని భావిస్తున్నారా? లేక‌.. జ‌రిగింది త‌ప్ప‌ని మౌనంగానే చెబుతున్నారా? అనేది తేలాల్సి ఉంది.