బాబు పెద్ద మ‌న‌సు.. తెలంగాణ డిమాండ్ కు ఓకే

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకొని తెలంగాణ‌కు తీపి క‌బురు చెప్పారు. ఆది నుంచీ… తెలుగు వారి సంక్షేమం త‌న ప్రాధాన్యత‌ అని పేర్కొంటున్న చంద్ర‌బాబు ఈ మేరకు ఓ కీల‌క‌, సుదీర్గ డిమాండ్ కు ఎస్ చెప్పేశారు. అదే తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంలో తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సులు ఆమోదించ‌డం. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్ర‌తిపాద‌న‌కు తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

తిరుమ‌త తిరుప‌తి దేవ‌స్థానం విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని తాజాగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్ల‌డించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సుభాష్ అనంతరం మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత ఎక్కువగా భక్తులు సందర్శించే యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ నూతన పాలకమండలి ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు (లెటర్ ప్యాడ్స్) లేఖలను ఆమోదించి, దర్శనం కల్పిస్తామని తెలిపారు. “టీటీడీ కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పడడానికి 2 నెలల సమయం పడుతుంది. కొత్త పాలకమండలి ఏర్పడిన వెంటనే తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించి తిరుమల దర్శనం సదుపాయాలు కల్పిస్తాం” అని వెల్లడించారు.

కాగా, ఇటీవ‌ల తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంత‌రం జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో తెలంగాణలోని పలు పుణ్య క్షేత్రాలకు భక్తులు వచ్చినప్పుడు వారందరికి దర్శనాలు కల్పిస్తున్నామని పేర్కొంటూ… తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తిరుమ‌ల‌లో అనుమతించకపోవడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలతో తిరుమలకు భక్తులు వచ్చినప్పుడు దర్శనానికి ఎందుకు అనుమతి ఇవ్వరని నిలదీశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుందని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఈ కామెంట్లు ఒకింత పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీశాయి. మొత్తంగా తెలంగాణ ప్ర‌జాప్రతినిధుల ఆలోచ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం ఓకే చెప్పింద‌ని పేర్కొన‌వ‌చ్చు.