తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో నేతలు కుత కుతలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం తెరమీదికి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ తెరమరుగు కావడం.. దీనిపై అధిష్టానం తేల్చిందని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఇంకా తేల్చలేదని చెబుతున్న దరిమిలా.. అసలు ఏం చేస్తారన్నది ఇప్పటికీ సందేహం గానే ఉంది.
అందరూ భావించినట్టుగా అయితే.. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ జరిగిపోయి ఉండాలి. సుమారు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు దక్కి ఉండాలి.
కానీ, నెలలు గడుస్తున్నా.. (మరో నెల రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతుంది) మంత్రి వర్గ విస్తరణ అంశం ఎటూ తేలలేదు. పైగా.. అదిగో ఇదిగో అంటూ కాల యాపన జరుగుతోంది.
దీంతో ఆశావహులు నీరు గారిపోతుండడంతోపాటు.. అధిష్టానంపై ఆగ్రహంతోనూ ఉన్నారు. మరోవైపు.. అసలు తెరవెనుక ఏదో జరుగుతోందని ఒకరిద్దరు నాయకులు చెబుతున్నారు. నల్లగొండకు చెందిన మాజీ మంత్రి ఒకరు తన కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
కానీ, ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి కొందరు ఉద్దేశ పూర్వకంగానే అడ్డంకులు సృష్టి స్తున్నారంటూ.. మీడియా ముందే కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ.. ఆయన తన బ్యాచ్‌కు ఇప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇక, కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చేది లేదని పైకి చెబుతున్నా.. అంతర్గతంగా వారి కోసం ఒకరిద్దరు ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా టీ కాంగ్రస్‌లో జోరుగానే సాగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే జీవన్ రెడ్డి బాహాటంగానే ఫిరాయింపులపై కామెంట్లు చేయడం గమనార్హం. ఆయన చాలా ముందు చూపుతోనే ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు మీడియా వర్గాలు కూడా చెబుతు న్నాయి.
మంత్రి పదవుల రేసులో ఒకరిద్దరు బీఆర్ ఎస్ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారని.. అందుకే.. జీవన్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం. ఏదేమైనా.. ఈ విషయంలో అధిష్టానం ఆలస్యం వెనుక.. మరో రీజన్ కూడా ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే.. మంత్రి వర్గం పదవుల విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.