వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఒక్కసారిగా పేలిన సరస్వతీ పవర్ షేర్ బాంబు
ఘటన దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లోనూ ప్రముఖంగా రావడం గమనార్హం. అది ఇది అనికూడా లేదు. చివరకు ఈశాన్య రాష్ట్రాల్లోని స్తానిక మీడియా కూడా.. ఫస్ట్ పేజీ ఇండికేషన్లు ఇచ్చేంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, జాతీయ మీడియా అయితే.. పుంఖాను పుంఖానులుగా వార్తలు వండి వార్చింది.
ఇక, ఈ విషయంలో ఎవరూ గుర్తించని.. ఎవరూ పట్టించుకోని క్యారెక్టర్ ఒకటి వెలుగు చూసింది. అసలు ఎంతో బిజీగా ఉండే.. జగన్.. పదే పదే బెంగళూరు టూర్లకు వెళ్తున్న జగన్.. ఈ విషయాన్ని ఎప్పుడు పసిగట్టారు? ఎలా పసిగట్టారు? ఆయనకు ఎలా అర్థమైంది? అనేది కీలకం. కానీ, వాస్తవానికి ఆయనకు వ్యక్తిగతంగా వ్యాపార సూత్రాలు తెలుసుకానీ.. కంపెనీ చట్టాలు, లిటిగేషన్లపై పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆది నుంచి అండగా ఉన్న విజయసాయిరెడ్డి కీలక రోల్ పోషించారని తెలుస్తోంది.
2019, ఆగస్టులోనే సరస్వతీ పవర్స్‌లో తనకు ఉన్న 99 శాతం వాటాను జగన్.. తన తల్లి విజయమ్మకు 48 శాతం ఇచ్చారు. దీనిలో కొంత భాగాన్ని షర్మిలకు చెల్లెలిపై ప్రేమతో రాస్తున్నట్టు గిఫ్ట్ డీడ్ చేశారు. వీటిని.. ఈడీ కేసులు పరిష్కారం అయ్యాక.. విజయమ్మ.. షర్మిలకు బదలాయించుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ వ్యవహారం అంతా కూడా.. సాయిరెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. పైగా.. అది కూడా.. బెంగళూరులోనే కావడం గమనార్హం.
ఇక, గత జూలైలో విజయమ్మ.. నుంచి షర్మిల ఈ వాటాలను బదలాయించుకునే ప్రయత్నం చేశారు. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నం చేశారు. అయితే.. ఈ వ్యవహారం సాయిరెడ్డి వరకు చేరింది. జగన్ కు అత్యంత సన్నిహితుడే కాకుండా.. ఆడిటర్‌గా కూడా ఉన్న నేపథ్యంలో సాయిరెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ బదలాయింపు జరిగితే.. జగన్‌తోపాటు.. తాను కూడా బెయిల్ కష్టాలు ఎదుర్కొనాల్సి వుంటుందని భావించిన సాయిరెడ్డి.. దీనిపై వెంటనే అలెర్టు చేసి.. కథ మొత్తాన్నీ ఒక కొలిక్కి తీసుకువచ్చారు. ఫలితంగా అతి పెద్ద గండం నుంచి తనను తాను కాపాడుకుంటూనే జగన్‌ను కూడా సాయిరెడ్డి కాపాడారని విశ్లేషకులు చెబుతున్నారు.