రాజకీయాల్లో ఏ నాయకుడికైనా.. తన కంటూ జేజేలు కొట్టే కార్యకర్తలు కావాలి. తనను ప్రశంసించే, తన మాటకు ప్రాధాన్యమిచ్చే నాయకులు కావాలి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నాయకులు, కార్యకర్తల అవసరం అధినేతలకు చాలా అవసరం. ఈ తరహా పరిస్థితి టీడీపీలో ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కార్యకర్తలను, నాయకులను, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది.
వారికి ఏ కష్టం వచ్చినా.. అది మంచైనా.. చెడైనా.. కాపాకాచేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో టీడీపీకి దూరమయ్యేందుకు పెద్దగా కార్యకర్తలు రెడీగా ఉండరు. ఇదే ఆ పార్టీ బలం. నాయకులు పోయినా.. కేడర్ ఉందన్న సంతృప్తి కూడా.. టీడీపీలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అసలు నాయకుల కంటే కూడా.. సాహసం చేసేది కేడరే. మరి అలాంటి కేడర్‌ను.. కాపాడుకోవడంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా విఫలమవుతున్నారన్న వాదన అయితే.. పార్టీలో బాహాటంగానే వినిపిస్తుండడం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఏంటి? అంటే.. అధినేతే అనేక చిక్కుల్లో ఉండడం. కుటుంబ రగడ, ఆస్తుల వివాదాలు.. రాజకీయంగా నాయకులు జారిపోవడం.. పార్టీలో అనిశ్చితి.. వంటివి జగన్‌కు కోలుకోలేని ఇబ్బందిగా మారాయి. నిజానికి ఆయనకు ఇవన్నీ చిన్నవే కావొచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో జెండా మోసేందుకు.. కార్యకర్తలు దూరమవుతున్నారు. పార్టీ అధినేత పరిస్థితి ఇలా ఉంటే.. తమ ఫ్యూచర్ ఏంటనేది వారిప్రశ్న. దీంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కనిపించడం లేదు.
ఇక, రాజకీయంగా బలమైన వారి మద్దతు కూడా కరిగిపోతోంది. ఒకప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జగన్‌కు మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఇక, పీఠాలు, స్వాములకు లెక్కేలేదు. జగన్ సీఎం అయ్యేందుకు యాగాలు చేసిన వారు ఉన్నారు. కానీ, ఇది కూడా గతంలో కలిసిపోతోంది. ఎవరూ ఇప్పుడు జగన్ పేరు తలుచుకునేందుకు.. ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ఇష్ట పడడం లేదు. ఎవరికి వారు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే ధోరణిలోనే ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates