ఏపీ-తెలంగాణ‌ల‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి.. ఒక చ‌ర్చ‌!

ఏపీ, తెలంగాణ‌ల‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉంది? ఏపీలో పుంజుకుంటోందా? తెలంగాణ‌లో సుస్థిరంగా ఉందా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయ వేదిక‌ల‌పై చ‌ర్చ‌గా మారిన విష‌యాలు. నిజానికి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఏపీలో పుంజుకోవ‌డం, తెలంగాణ‌లో బ‌ల‌మైన వ్యూహంతో ముందుకు సాగ‌డం అనేవి అత్యంత కీల‌కం. కానీ, ఆదిశ‌గా పార్టీ అడుగులు స‌క్ర‌మంగానే ప‌డుతున్నాయా? అనేది చ‌ర్చ‌. అతి క‌ష్టం మీద‌.. బీఆర్ ఎస్ వంటి బ‌ల‌మైన పార్టీని ఓడించినా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో తెలంగాణ‌లో పార్టీ ఇబ్బందులు ప‌డుతోంది.

ఇక‌, బ‌ల‌మైన నాయ‌కురాలిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ ఉంటే.. త‌మ‌కు ఢోకా ఉండ‌ద‌ని అంచ‌నా వేసుకున్న కాంగ్రెస్ పెద్ద‌ల‌కు ఆ త‌ర‌హా అంచ‌నాలు ఎక్క‌డా మ‌చ్చుకు కూడా క‌నిపించ‌డం లేద‌న్న‌ది మ‌రో వాద‌న‌. వెర‌సి రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగానే మారిపోయింది. దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ‌లో..

అధికారంలో ఉన్న తెలంగాణ‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, నేత‌ల దూకుడుతో ఒక విధంగా పార్టీ అంత‌ర్మ‌థ‌నంలో ఉంది. అంద‌రూ సీనియ‌ర్ నాయ‌కులు కావ‌డంతోపాటు.. సొంత పార్టీలోని నాయ‌కుల తో ఒక‌రికి ఒక‌రికి పొస‌గ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు.. పార్టీని రోడ్డెక్కిస్తున్నారు. గ‌త వారం రోజులుగా జీవ‌న్ రెడ్డి చేస్తున్న పోరాటం.. రాజకీయంగా పార్టీని ఇర‌కాటంలోకి నెడుతోంది. త‌న అనుచ‌రుడి హ‌త్య‌.. అనంత‌రం.. ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలు.. పార్టీకి ఇబ్బందిగా మారాయి.

ఫిరాయింపుల‌ను జీవ‌న్ రెడ్డి నేరుగా ప్ర‌శ్నిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీల‌తోపాటు మొత్తం 8 మందికి పార్టీ ఫిరాయింపుల‌పై తీవ్రంగా స్పందిస్తూ లేఖ సంధించారు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న మ‌న పార్టీకి ఫిరాయింపులు ఎందుకంటే.. జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్న లేవ‌నెత్తారు. ఈ వ్య‌వ‌హారంఅంత‌ర్గ‌తంగా పార్టీని ఇర‌కాటంలోకినెట్టింది. ఇక‌, సీఎం స‌హా కొంద‌రు మంత్రులు దూకుడుతో ప్ర‌జ‌ల్లో గ్రాఫ్ త‌గ్గుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఇది బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ ఎస్‌కు రాజ‌కీయ ఆయుధాలు అందిస్తున్న‌ట్టు అయింది.

ఏపీలో..

పార్టీని ప‌క్కా వ్యూహంతో ముందుకు న‌డిపిస్తార‌న్న అచంచ‌ల ఆశ‌ల‌తో ప‌గ్గాలు అప్ప‌గించిన వైఎస్ కుమార్తె ష‌ర్మిల వ్య‌వ‌హారం.. నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. ఎన్నిక‌ల అనంత‌రం నాలుగు మాసాలైనప్ప‌టికీ.. పార్టీ పుంజుకునే అంశంపై ఆమె ఇప్ప‌టికీ దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం దీనికి ప్ర‌దాన ఉదాహ‌ర‌ణ‌. సాధార‌ణంగా జాతీయ పార్టీల్లో వ్య‌క్తిగ‌త అజెండాలు ఉండ‌వు. కేవ‌లం పార్టీ ఎదుగుద‌ల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాలి.

కానీ, ష‌ర్మిల వ్య‌క్తిగ‌త అజెండాల‌తో ముందుకు సాగుతున్నార‌న్న వాద‌న పార్టీలోనేకాదు.. బ‌య‌ట‌కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా టీడీపీతో ఆమె చేస్తున్న చెలిమిని మెజారిటీ నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో ఉండ‌క‌పోవ‌డం, పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయలేక‌పోవ‌డం ఇక్క‌డ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. మ‌రో ఏడాదిలో స్థానిక సంస్త‌ల ఎన్నిక‌లు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ అస‌లు పుంజుకుంటుందా? అనేది స‌మ‌స్య‌.