నారా లోకేష్ అమెరికా టూర్‌.. ఆశ‌లు ఫ‌లించేనా?

ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్ర‌వారం నుంచి అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు ప‌దిరోజుల పాటు ఆయ‌న అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. బిజీ షెడ్యూల్‌తో పాటు భారీ ఆశ‌ల‌తో ఆయ‌న అగ్ర‌రాజ్యంలో అడుగు పెట్ట‌నున్నారు. భారీ ఎత్తున పెట్టుబ‌డులు తీసుకురావాల‌న్న‌ది  నారా లోకేష్ ఆశ‌యం. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు కంపెనీల‌ను తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. టాటా కంపెనీతోనూ ఇటీవ‌ల చ‌ర్చించారు. విశాఖ‌లో టీసీఎస్ ఏర్పాటుపై మంత‌నాలు జ‌రిపారు.

అదేవిధంగా త‌మిళ‌నాడుకు చెందిన శివ‌నాడార్ సంస్థ‌తోనూ నారా లోకేష్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక‌, జ‌పాన్ దౌత్య బృందాన్ని కూడా రెండు రోజుల కింద‌ట క‌లిసి.. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న వాతావర ణాన్ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే తొలిసారి పెట్టుబ‌డుల కోసం.. అమెరికాకు వెళ్తున్నారు. ఇక్క‌డి టెస్లా స‌హా గూగుల్‌, మెటా సంస్థ‌ల‌తో చ‌ర్చించి.. పెట్టుబ‌డుల కోసం వారి ఒప్పించి.. మెప్పించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే అధికారుల‌తో క‌లిసి నారా లోకేష్ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. కానీ, ఇప్పుడు అమెరి కా ప‌రిస్థితి రాజ‌కీయంగా హాట్‌హాట్‌గా ఉంది. వ‌చ్చే నెల 5వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌ను న్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరిక‌న్ల మూడ్ అంతా రాజ‌కీయాల వైపే ఉంది. పైగా పెట్టుబ‌డి దారులు కూడా.. విదేశాల‌కు వెళ్లాలా?  అమెరికాలోనే ఉండాలా? అనే డోలాయ‌మాన స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల ప‌రిస్థితిని వారు నిశితంగా అధ్య‌య‌నం చేస్తున్నారు.

మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచే  ప‌రిస్థితి ఉంటే క‌నుక‌.. పెట్టుబ‌డి దారులు అమెరికాలోనే ఉంటా రు. ప్ర‌స్తుతం ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం.. త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భారీ ఎత్తున విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ్యాపార వ‌ర్గాలు సిద్ధంగా అయితే లేదు. ఇటీవ‌ల‌.. కొన్ని దేశాల ప్ర‌తినిధుల‌కు ఇదే అనుభ‌వం ఎదురైంది. సో.. ఇలాంటి ప‌రిస్థితిలో నారా లోకేష్ అమెరికా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావాల‌నే కోరుకుందాం.