చెల్లిని కోర్టుకు లాగడం సామాన్యం కాదు జగన్ సార్: షర్మిల

ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటాయని, వాటిని రాజకీయం చేయడం సరికాదని ఏపీ మాజీ సీఎం జగన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తన సోదరి షర్మిల తనకు రాజకీయంగా వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఆస్తుల విషయంలో తేడా వచ్చిందని జగన్ చెప్పిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు.

సామాన్యం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని, ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సార్ అంటూ షర్మిల తన సోదరుడు జగన్ కి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. తమ కుటుంబంలో ఆస్తుల వివాదం నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని అనుకున్నామని, సామరస్యంగానే దానిని సెటిల్ చేసుకోవాలనుకున్నామని షర్మిల చెప్పారు. కానీ, సామాన్యం అంటూనే అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చారని, ఇది సామాన్య విషయం కాదని షర్మిల అన్నారు.

ఆస్తుల అటాచ్ మెంట్ అని, ఈడీ కేసులు, బెయిల్ అని జగన్ చెబుతున్నారని, కానీ సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే జగన్ కు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని ఈడీ అటాచ్ చేసిందని, కానీ, సరస్వతి కంపెనీ భూములను ఈడీ ఏనాడు అటాచ్ చేయలేదని షర్మిల క్లారిటీనిచ్చారు. ఏ సమయంలో అయినా షేర్లను బదిలీ చేసుకునే అవకాశం ఉందని, 2016లో ఈ ఆస్తులు అటాచ్ చేసినందువలన షేర్లు బదిలీ జరగకూడదని జగన్ వాదిస్తున్నారని, అది సరికాదని చెప్పుకొచ్చారు.

అలా అయితే, 2019లో 100% వాటాలు బదలాయిస్తామని ఎంవోయుపై జగన్ సంతకం ఎలా చేశారని షర్మిల ప్రశ్నించారు. ఆనాడు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని జగన్ కు షర్మిల సూటి ప్రశ్న సంధించారు. మరి, షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.