ఏదో సినిమాలో ఆ ఒక్కటి అడక్కు! అన్నట్టుగా ఏపీకి కీలకమైన విశాఖ రైల్వే జోన్ మినహా.. మిగిలిన వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా వరాల జల్లు కురిపించింది. రైల్వే నుంచి రోడ్డు వరకు.. పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్‌లో పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంతోపాటు.. వాటికి మాస్టర్ ప్లాన్ కూడా మంజూరు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
ఇవీ విశేషాలు..
- విశాఖ రైల్వే జోన్ వ్యవహారంపై చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఈ జోన్ వ్యవహారం.. రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగులో ఉందన్నారు. దీనిని పూర్తి చేయాలని చాలా సార్లు కోరామని కూడా.. చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తే.. కావాల్సిన సదుపాయాలు, భూములు కూడా ఇస్తామన్నారు. అయితే.. ఈ విషయం పరిశీలనలో ఉందంటూ.. అశ్వినీ వైష్ణవ్ దాట వేశారు.
- అనంతపురం జిల్లా పరిటాలను
మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్
గా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక్కడ కార్గో టెర్మినల్ ఏర్పాటు కానుంది. దీనివల్ల 2 నుంచి 5 వేల మందికి ఉపాధి కలగనుంది. - ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ది, చిరు వ్యాపారులకు ప్రోత్సాహం లభించనుంది. అదేవిధంగా ఉపాధికల్పనకు కూడా ఈ రైల్వే స్టేషన్లు దోహద పడనున్నాయి.
- ఏపీలో 160 కిలో మీటర్ల వేగంతో సెమీ హైస్పీడ్ రైళ్లు నడిచేలా మూడు లైన్లను అభివృద్ది చేస్తున్నారు. ఇవి.. అమరావతి-హైదరాబాద్, అమరావతి-చెన్నై, అమరావతి-బెంగళూరు.
- పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజా రవాణాకు మెరుగైన వ్యవస్థ ఉండేలా మల్టీ ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.
- శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన ప్రాంతమైన రణస్థలం వద్ద జాతీయ రహదారి ఏర్పాటుకు కూడా కేంద్రం ఓకే చెపింది. దీనికి సుమారు 250 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 లైన్ల రహదారి ఏర్పాటు చేయనున్నారు. ఫలితంగా పట్టణ ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది.