ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేయడం, ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోని తాజాగా ఈ విషయంలో టీడీపీ నేతల విమర్శలపై జగన్ స్పందించారు. తమ కుటుంబ సమస్యను రాజకీయం చేయడం ఏంటని జగన్ మండిపడ్డారు.
ఎన్నికల హామీలు నెరవేర్చని కూటమి సర్కార్… డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని జగన్ విమర్శించారు. ఈసారి తన అమ్మ, చెల్లెలు ఫోటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. టీడీపీ అక్రమాలు అన్యాయాలు బయటపెడుతున్న కారణంతోనే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని జగన్ ఆరోపించారు. కుర్లలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు.
కుర్లకు తాను వస్తున్నానని తెలిసి రాజకీయం చేస్తున్నారని, కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలని జగన్ అన్నారు. మీ కుటుంబాల్లో ఇటువంటి గొడవలు లేవా ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండే విషయాలే అని జగన్ చెప్పారు. వాస్తవాలను వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోవాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జగన్ హితవు పలికారు.
రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని, ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇక, విజయనగరంలోని కుర్లలో డయేరియాతో చనిపోయిన వారి కుటుంబానికి 2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని జగన్ ప్రకటించారు. మరి బాధితులకు ప్రభుత్వం ఏం సహాయం అందిస్తుంది అని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలోని వైసిపినే ఇంత సాయం చేస్తుంటే అధికారపక్షం నిద్రమత్తులో ఉందా అని జగన్ ప్రశ్నించారు. అయితే ప్రతిపక్ష హోదా లేని జగన్ తాము ప్రతిపక్షంలో ఉన్నామంటూ చెప్పుకోవడం పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates