వైసీపీకి మరో పెను గండం పొంచి ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. కీలకమైన కాపు నాయకుడు.. 2019 లో పవన్‌ను ఓడించిన నాయకుడు.. ఇప్పుడు జగన్ కు బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో జనసేన తరఫున పవన్ కల్యాణ్.. పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పవన్ పోటీ చేశారు. భీమవరంలో వైసీపీ తరఫున కాపు నాయకుడు గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి పవన్‌పై విజయం దక్కించుకున్నారు.
అయితే.. పవన్‌ను ఓడించి.. వైసీపీ పరువు నిలబెట్టిన తనకు మంత్రి పదవి దక్కుతుందని.. జగన్ దగ్గర మరింత పరపతి చిక్కుతుందని గ్రంధి ఆశించారు. కానీ, ఆయనకు అలాంటిదేమీ దక్కలేదు. నిజానికి పవన్‌ను ఇద్దరు వైసీపీ నాయకులు ఓడించారు. వారిలో ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఇక, ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని అనుకున్నా.. అది కూడా లభించలేదు. ఇక, ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి.
కానీ, జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అనుకున్నవారిలో గ్రంధి కూడా ఒకరు. దీంతో ఆయన తన ప్రతిపాదనను వాయిదా వేసుకున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ వైపు దృష్టి పెట్టినట్టు సమాచారం. త్వరలోనే ఆయన టీడీపీతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు వార్తలు గుప్పుమంటు న్నాయి. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ కీలక నేతలను రంగంలోకి దింపింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన.. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కృష్నాకు చెందిన కాపునాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇద్దరూ.. గ్రంధితో చర్చలు జరుపుతున్నారు. మరి ఈ బుజ్జగింపులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. కాగా.. వైసీపీలో అసలు బుజ్జగింపుల పర్వం లేదని చెప్పే నాయకులు ఇప్పుడు గ్రంధిని ఎందుకు బుజ్జగిస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. గతంలో ఇదే జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్ ఉరఫ్ నాని రాజీనామా చేసినప్పుడు లైట్ తీసుకున్న విషయం తెలిసిందే.