అవ‌మానం తొల‌గించుకొని… ఆల్ రైట్ స్థాయికి చేరిన రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు అనుకోకుండానే కలిసి వచ్చిన అవకాశంతో చెక్‌ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారం, ఒకింత అవమాన పర్వానికి ఆయన ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ నామినేషన్ పర్వం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైడ్రా కూల్చివేత‌లు, గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ లోని జీవో 29 కార‌ణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యంగా విద్యార్థులు రోడ్డెక్క‌డం సహా వివిధ అంశాల్లో తీవ్ర వ్యతిరేకతని సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ… ఈ విషయం ఢిల్లీ పెద్దలకు కూడా చేరింది అనేది ఈ వ్య‌తిరేక ప్ర‌చారంలోని సారాంశం. యువ నేతగా అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే రేవంత్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతని సొంతం చేసుకున్నారని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో, రాజకీయ స్ర‌వంతిలో గుసగుసలు వినిపించాయి.

పై కారణాలనే పేర్కొంటూ రేవంత్ కి ఢిల్లీలో అపాయింట్మెంట్ కరువైందని అందుకే ఇటీవల కాలంలో తరచుగా ఢిల్లీ వెళ్తున్న పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్య నేతలైన రాహుల్ ప్రియాంకల దర్శనం దొరకడం లేదని రేవంత్ రెడ్డికి ఇది ఊహించ‌ని ప‌రిణామం.. ఒకింత అవ‌మానం అనేది ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా ప్రియాంక గాంధీ నామినేషన్ ఈ ప్రచారానికి చెక్ పెట్టింది.

తన సోదరుడైన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఏర్పడిన వయనాడు ఎంపీ స్థానంలో పోటీ చేసే అవ‌కాశం నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం ప్రియాంక గాంధీ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ త‌ర‌ఫున ముఖ్య నేత‌లు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మానికి రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ ముఖ్య‌నేత‌లై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల‌కు నమస్కరించారు. వారికి పార్టీ కండువాలు క‌ప్పారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ ఉటంకిస్తున్న రేవంత్ అనుచ‌ర వ‌ర్గం ఢిల్లీ కేంద్రంగా రేవంత్‌ పట్ల జరుగుతున్న ప్రచారం నిజం కాదని ప్రచారంలో పెట్టింది.