నా చెల్లి మోసం చేసింది: ష‌ర్మిల‌, విజ‌యమ్మ‌ల‌పై జ‌గ‌న్ పిటిష‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, త‌న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. హైదరాబాద్‌లోని నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ఆయ‌న పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌ను ‘మోసం’ చేశారంటూ.. ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

విష‌యం ఇదీ..

బెంగ‌ళూరులో ఉన్న స‌రస్వ‌తీ ప‌వ‌ర్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తాను ప్రేమ కొద్దీ త‌న మాతృమూర్తి విజ‌య రాజ‌శేఖ‌ర‌రెడ్డికి 48.99 శాతం షేర్లు ఇచ్చిన‌ట్టు తెలిపారు. దీనిలో 29.88% షేర్లు త‌న‌పేరుపై ఉన్నాయ‌ని, మ‌రో 16.33 % షేర్లు భార‌తి పేరుతో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు విజ‌య రాజ‌శేఖ‌ర రెడ్డి పేరుతో ఉన్న షేర్ల‌ను మోస పూరితంగా, కుట్ర పూరితంగా ష‌ర్మిల స్వాధీనం చేసుకున్నార‌ని తెలిపా రు.

ష‌ర్మిల‌కు షేర్లు బ‌ద‌లాయించే ఉద్దేశం త‌న‌కు లేద‌ని పిటిష‌న్‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు. అయినా.. మోసం, కుట్ర పూరితంగా త‌న త‌ల్లికి కేటాయించిన షేర్ల‌ను ష‌ర్మిల తీసుకుంద‌ని వివ‌రించారు. దీనివ‌ల్ల‌.. కంపెనీ పై త‌మ ఆధిప‌త్యం పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు 51.01% షేర్ల‌ను ఇచ్చేలా చూడాల‌ని ట్రైబ్యున‌ల్‌కు విన్న‌వించారు.

2019లో ష‌ర్మిల‌కు తోడ‌బుట్టిన సోద‌రిగా కొన్ని షేర్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. అయితే.. ఆమె రాజ‌కీయంగా విభేదాలు పెట్టుకున్న నేప‌థ్యంలో త‌మ నుంచి దూర‌మైంద‌ని.. అందుకే.. ఆమెకు షేర్లు కేటాయించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో విచారించి.. త‌మ‌కు 51.01 శాతం షేర్లు ల‌భించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. కాగా, ఈ కేసు గ‌త నెల‌లోనే ఫైల్ అయింది. ఆల‌స్యంగా వెలుగు చూసింది.