వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకుడు, ఒకప్పటి జగన్ స్నేహితుడు, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆయన చేసిన దుర్మార్గాలను సీరియల్‌గా తీస్తే.. కొన్ని సంవత్సరాల పాటు ప్రసారం చేసుకోవచ్చన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని అన్నారు.
ఇప్పుడు వాటిని సక్రమమార్గంలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతున్నట్టు చెప్పా రు. ముఖ్యంగా వ్యవస్థలను ఈ స్థాయిలో ధ్వంసం చేసిన ముఖ్యమంత్రిని తాము ఎప్పుడూ చూడలేదన్నా రు. అయినా.. అనేక ఇబ్బందులు తట్టుకుని సీఎం చంద్రబాబు కష్టపడుతున్నట్టు చెప్పారు. విద్యుత్ చార్జీలను అడ్డగోలుగా పెంచేసిన జగన్.. ప్రజల నెత్తిన భారం మోపారని చెప్పారు. ఇప్పుడు ఆ భారాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా.. సాధ్యం అవుతుందా? లేదా ? అనేది చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.
ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన.. జగన్ ఐదేళ్లలో చేసిన అరాచకాల వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనమయ్యాయని మంత్రి రవి నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అప్పటి వరకు పదిలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ నాశనమైందని దుయ్యబట్టారు. ప్రజలకు అన్నీ తెలిసు కాబట్టే.. వైసీపీకి 11 స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారని అన్నారు. ముంబైకి చెందిన నటి కాదంబరిని పోలీసు అధికారులతో వేధించారని.. ఇది సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేసేదేనా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడిలో పడ్డాయని మంత్రి తెలిపారు. ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉంటున్నారని చెప్పారు. అంతా బాగానే ఉన్నా.. ఏదో జరిగిపోతోందంటూ.. జగన్ అవాకులుచవాకులు పేలుతూ.. సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఎంత ప్రయత్నించినా.. ప్రజలకు చేసిన దుర్మార్గం ముందు.. అవన్నీ.. కొట్టుకుపోవడం కాయమన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates