ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఇవి నేరుగా ఇరు రాష్ట్రాల ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలు ఇరు రాష్ట్రాల్లోనూ తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య తిరుమల వ్యవహారం లొల్లిగా మారే ప్రమాదం ఏర్పడింది.
తాజాగా తెలంగాణకు చెందిన జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న తెలంగాణ వారికి తాము ఇస్తున్న సిఫారసు లేఖలను ఇక్కడ అనుమతించడం లేదని, కనీసం తమ వారికి ఒక్క రూమ్‌ను కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ , ఆంధ్ర నాకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఒక కన్ను పొడిచేసుకొన్నారా..? అని తీవ్ర వ్యాఖ్యలు సంధించారు.
తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లను తిరుమలలో అనుమతించనప్పుడు, తెలంగాణలో మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోన్ చేస్తే యాదగిరి గుట్ట సహా పలు దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు ఎందుకు ఏర్పాటు చేయాలని అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. తమ లెటర్లు అనుమతిస్తారా? లేక తామంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలా అని వ్యాఖ్యానించారు. తెలంగాణను కేవలం వ్యాపారం చేసుకోవడానికే వాడుకుంటున్నారని చెప్పారు.
ఈ పరిస్థితికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలని.. తమను కూడా అన్నదమ్ముల మాదిరిగానే చూడాలని చెప్పారు. లేకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చించి.. తాము కూడా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సిఫారసు లేఖలను అనుమతించని మాట వాస్తవమే.