కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత.. ముద్రగడ పద్మనాభం(రెడ్డి) కుమార్తె ముద్రగడ క్రాంతి తాజాగా జనసేన తీర్థం పుచ్చు కున్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన కండువా కప్పుకొని.. ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రాంతితోపాటు.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటకు చెందిన మునిసిపల్ కౌన్సిలర్లు.. నలుగురు కూడా పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొన్నారు.
వీరంతా ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలతో కలిసి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చారు. అనంతరం.. పవన్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో పిఠాపు రం నియోజకవర్గంలో క్రాంతి తనకు అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు.
ఆమె ధైర్యానికి, సాహసానికి తాను ఫిదా అయిన ట్టు చెప్పారు. “క్రాంతి ఏమీ.. సామాన్య వ్యక్తికాదు. ఆమె తండ్రి దిగ్గజ నాయకుడు. అలాంటి నాయకుడైన తండ్రిని కూడా ఎదిరించి.. మంచి కోసం.. నిజాయితీ కోసం నిలబడడం అంటే.. మాటలు కాదు. ఆమెను ఆరోజే నేను మనస్పూర్తిగా అభినందించా” అని పవన్ వ్యాఖ్యానించారు.
ముద్రగడ క్రాంతికి మంచి భవిష్యత్తు ఉంటుందని పవన్ తెలిపారు. ఇక, ఎన్టీఆర్ జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వాహక అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఇటీవల జనసేనలోకి వచ్చిన సామినేని ఉదయ భానుకు అప్పగిస్తున్నట్టు పవన్ ప్రకటించారు.
సామినేని వంటి సీనియర్ నాయకుడి చేతిలో ఎన్టీఆర్ జిల్లా జనసేన బాధ్యతలు పెడుతున్నట్టు తెలిపారు. పార్టీని అన్ని కోణాల్లోనూ అభివృద్ది చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పార్టీని విస్తరించాలని ఉన్నా.. నాయకుల కోసం ఎదురు చూస్తున్నామని.. ఇలాంటి సమయంలో బలమైన నాయకులు రావడం.. వారికి బాధ్యతలు అప్పగించడం పార్టీ అభివృద్ధికి దోహ ద పడుతుందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates