మంత్రికి మద్దతు కరువైందా ? ఒంటరైపోయినట్లేనా ?

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ విషయమే పార్టీలో ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందుతునిగా ఉన్న కార్తీక్ నుండి కోటి రూపాయల బెంజి కారును మంత్రి కొడుకు బహుమతిగా తీసుకున్నాడనే ఆరోపణలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రిపై చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తన ఆరోపణలకు మద్దతుగా అయ్యన్న నాలుగు ఫొటోలను కూడా జతచేయటంతో ఆరోపణలపై మరికాస్త హీట్ పెరిగిపోయింది.

చింతకాయల చేసిన ఆరోపణలు నిజమా ? కాదా ? అన్న విషయాలను పక్కనపెట్టేద్దాం. మంత్రిపై వచ్చిన ఆరోపణల విషయంలో జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో కూడా ఎవరికీ తెలీదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రిపై టిడిపి నేతలు పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తుంటే సహచర మంత్రుల్లో ఒక్కరు కూడా మద్దతుగా మాట్లాడలేదట. ఎంతసేపు తాను నిర్దోషినని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవటమేనా ? మిగిలిన మంత్రులు, జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపిలు ఎందుకు మద్దతుగా మాట్లాడటం లేదనేదే జయరామ్ ను మానసికంగా వేధిస్తోందట.

నిజానికి జిల్లాలో కానీ పార్టీలో కానీ జయరామ్ పెద్ద పేరున్న నేత అయితే కాదు. ఏదో చివరి నిముషంలో పరిస్ధితులు కలిసొచ్చి టికెట్ దక్కటంతో గెలిచిపోయారు. తర్వాత అదృష్టం కూడా కలసిరావటంతో ఏకంగా మంత్రే అయిపోయారు. జిల్లాలోని చాలామంది సీనియర్ నేతలతో జయరామ్ కు పెద్దగా సఖ్యత లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకనే మంత్రిపై ఆరోపణలు వస్తున్నా ఎవరు పెద్దగా పట్టించుకోవటం లేదట. దానికి తోడు పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా మంత్రిని ఇరుకున పెట్టేస్తున్నాయి. మంత్రిపై వస్తున్న ఆరోపణలను ఆయన సొంత వ్యవహారంగా వైసిపి నేతలు చూస్తున్నారట.

ఇప్పటికే మంత్రి సొంతూరు గుమ్మనూరులో పేకాట క్లబ్బుల వ్యవహారం, పోలీసుల దాడులు, మద్దతుదారుల అరెస్టు వంటి వాటితో ప్రభుత్వం పరువు కాస్త దెబ్బతిన్నది. దీనికితోడు మంత్రి మద్దతుదారులపై భూకబ్జా ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయట. వీటికి క్లైమ్యాక్స్ గా ఇఎస్ఐ నిందుతుని దగ్గర నుండి బెంజి కారు ఆరోపణలు చుట్టుముట్టాయి.

అసలు గుమ్మనూరులో పేకాట క్లబ్బుల వ్యవహారాన్ని మంత్రి అంటే పడని పార్టీ నేతల్లోనే కొందరు పోలీసులకు ఉప్పందించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా జయరామ్ వ్యవహారం మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నది వాస్తవం. మరి ఈ మంత్రిపై జగన్ ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే సస్పెన్సుగా మారిపోయింది.