ఏపీ రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఐడేళ్ల తర్వాత.. మళ్లీ ఇక్కడ పనులు చేపట్టనున్నారు. 2015లో శంకు స్థాపన జరిగిన రాజధాని అమరావతికి.. గత ఐదేళ్ల పాటు గ్రహణం పట్టిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని రాజధాని ప్రధాన ప్రాంతం రాయపూడిలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి, పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఆయన కొబ్బరికాయ కొట్టారు.
ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా.. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.160 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో రాజధానిలో ఏపీ సీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించను న్నారు. ఈ పనులకే తాజాగా సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టిన సీఆర్డిఏ.. తర్వాత వైసీపీ రాకతో పనులను నిలిపివేసింది. అంతేకాదు.. అసలు సీఆర్ డీఏనే జగన్ సర్కారు రద్దు చేసింది.
దీని స్థానంలో ఏపీఆర్ డీఏ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ.. సీఆర్ డీఏ చట్టంలో మార్పులు చేసింది. కానీ, కూటమి సర్కారు వచ్చాక.. మళ్లీ సీఆర్ డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డిఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి తాజాగా ఆయా పనులను ప్రారంభించారు. ఇదిలావుంటే.. కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల రూపాయలు రానున్నాయి. ఇవి రాగానే ప్రధాన పనులు కూడా ప్రారంభించనున్నారు.
మరోవైపు ఏషియా డెవలప్ మెంట్ బ్యాంకు(ఏడీబీ) కూడా రూ.15 వేల కోట్లను రుణం రూపంలో అందించ నుంది. ఈ మొత్తం నిధులతో వచ్చే ఏడాది చివరి నాటికి అమరావతికి ఒక రూపం తీసుకురావాలని చంద్రబాబు తలపోస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు పనులు ప్రారంభించడం గమనార్హం.