ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూకట్టుకుని మరీ నాయకులు పార్టీకి బై కొడుతున్నారు. వీరిలో కీలకమైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటివారు ఉన్నారు. ఇక, మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు రాజకీయాలే వదిలేస్తున్నారు. ఇలా.. వైసీపీలో నాయకులు పోయే బ్యాచే తప్ప వచ్చే బ్యాచ్ కనిపించడం లేదు. అసలు ఉన్నవారైనా ఎన్నాళ్లు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీలోకి ఎవరైనా వస్తే.. ఆ పార్టీ కండువా ఎవరైనా కప్పుకొంటే.. పెద్ద సంచలనమే! అదే ఇప్పుడు జరిగింది. వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నవారే కాకుండా.. వస్తున్నవారు ఒకరిద్దరు కనిపిస్తుండడంతో ఆ పార్టీలో కొంత నూతనోత్సాహం నెలకొంది. దాదాపు నాలుగు మాసాల తర్వాత.. వైసీపీలో చేరిక కనిపించింది. అదికూడా.. టీడీపీ నుంచి రావడం మరో సంచలనం. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ పార్టీపై అసంతృప్తితో కీలక నేత బయటకు వచ్చారు.
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గానికి టీడీపీ పరిశీలకుడుగా వ్యవహరించిన ముదునూరి మురళీకృష్ణ తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ పిల్లి ఆధ్వర్యంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సమయంలోనే ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సహా నియోజకవర్గం పరిశీలకుడిగా ఉన్న తన పదవులకు రాజీనామా చేశారు. అదేవిధంగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు.
అనంతరం.. గురువారం సాయంత్రం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈయనకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. అధికార పార్టీ నుంచి మురళీకృష్ణ రావడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని టీడీపీ లైట్‌గా తీసుకుంటే ఏమో చెప్పలేం కానీ.. సీరియస్‌గా తీసుకుంటే.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల దూకుడు ఎలా ఉందో అర్థం అవుతుంది. తద్వారా పార్టీలో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates