వ‌డివ‌డిగా అమ‌రావ‌తి అడుగులు!

రాజ‌ధాని అమ‌రావ‌తి అడుగులు వ‌డివ‌డిగా ప‌డ‌నున్నాయి. కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌ధాని నిర్మాణాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ హ‌యాంలో ఐదేళ్ల పాటు రాజ‌ధానిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చిన్న‌పాటి అడివిగా మారిపోయిన నేప‌థ్యంలో దానిని తీసేసి.. అమ‌రావ‌తికి ఒక రూపం క‌ల్పించే ప‌నిని చేప‌ట్టారు. దీనికి గాను 33.86 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నా రు. ముందుగా పెట్టుకున్న ల‌క్ష్యం మేర‌కు ఈ నెల 20తో ఆ ప‌నులు పూర్త‌వుతాయి.

నీటి కుంట‌ల‌ను శుభ్రం చేయ‌డం, చెత్తా చెదారం ఏరేయ‌డం, న‌వ న‌గ‌రాల్లో పేరుకుపోయిన చెత్త‌ను తొల గించ‌డంతోపాటు.. చిట్ట‌డ‌విని త‌ల‌పిస్తున్న ప్రాంతాల‌ను శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా ర‌హదారుల‌పై పేరుకున్న బుర‌ద‌ను కూడా తొల‌గిస్తున్నారు. ఈ ప‌నులు రెండు రోజుల్లో ముగియ‌నున్నాయి. ఇటీవ‌ల నారాయ‌ణ కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించి.. సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు పూర్తికాగానే మ‌రుక్ష‌ణ‌మే ప‌నులు ప్రారంభించేందుకు స‌ర్కారు సిద్ధ‌మైంది.

సీఆర్డీఏ చట్టం 2014 ప్రకారం అన్ని లెక్క‌ల‌ను అకౌంటెంట్ జ‌న‌ర‌ల్‌కు స‌మ‌ర్పించ‌నున్నారు. 2014 నుంచి 2017 వ‌ర‌కు ఆడిట్ రిపోర్టును స‌మ‌ర్పించారు. అయితే.. 2017-18 నుంచి ఆడిటింగ్ జ‌ర‌గ‌లేదు.ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి ఆరేళ్ల కాలానికి ఆడిట్ రిపోర్ట్ ను అకౌంటెంట్ జ‌న‌ర‌ల్‌కు ఇవ్వ‌నున్నారు. దీనివ‌ల్ల‌.. కేంద్రం ఇచ్చే 15 వేల కోట్ల ఖ‌ర్చుకు సంబంధించిన అనుమ‌తులు త్వ‌రిత‌గతిన రానున్నాయి. కేంద్రం రూ.15 వేల కోట్ల‌ను అప్పు రూపంలో ప్ర‌పంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, అమ‌రావ‌తి నిర్మాణాలకు కేంద్రం నుంచి అనేక అనుమ‌తులు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కీల‌కంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల నుంచి అనుమ‌తులు తీసుకోవాలి. ఎందుకంటే.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ(ఏషియా డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌) నుంచి కూడా అమ‌రావ‌తి నిర్మాణానికి నిధులు వ‌స్తున్నాయి. దీంతో ఆయా అనుమ‌తులు తెచ్చుకునేందుకు స‌ర్కారు అధికారుల‌ను ఆదేశించింది. ఈ అనుమతులు త్వరగా వస్తే.. ప‌నులు చేప‌ట్టేందుకు.. నిధులు వ‌చ్చేందుకు కూడా వీలుంటుంది. ఇవి కూడా ఈ నెల ఆఖ‌రులోగా పూర్తి చేయ‌నున్నారు. త‌ద్వారా.. అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించేలా చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యించింది.