ఏపీ సీఎం చంద్రబాబు మాస్టారు అవతారం ఎత్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర భవితవ్యాన్ని సమగ్రంగా వివరించారు. అయితే.. సహజంగా ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం తాజాగా మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేక విషయాలు వివరించడం గమనార్హం. గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇలానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో అమలు చేయనున్న వివిధ పాలసీలను ఆయన సమగ్రంగా వివరించారు.
మొత్తంగా ఆరు పాలసీలను తీసుకురానున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ, ఏపీ ఎంఎస్ఎంఈ, ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఏపీ ప్రైవేటు పార్కుల పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలను ఇప్పటికే ప్రకటించామని.. వీటిని సమగ్రంగా అధ్యయనం చేసి వచ్చే రోజుల్లో అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటి ద్వారా ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఈ పాలసీల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
సంపద సృష్టి..
ప్రస్తుతం ప్రకటించిన ఆరు పాలసీల ద్వారా రాష్ట్రానికి సంపద పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు సొమ్ములు చేకూరుతాయని వివరించారు. సంపద సృష్టి జరిగితే సూపర్ సిక్స్ అమలు చేయడం పెద్ద కష్టం కాదని అన్నారు. “అన్నీ ఆలోచించుకునే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. కానీ, గత వైసీపీ పాలనలో ధ్వంసమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నాం. సంపద సృష్టిస్తాం. దీనిని ప్రజలకు పంచుతాం” అని మరోసారి చంద్రబాబు వివరించారు. గతంలోనూ ఆయన ఈ సూత్రాన్ని చెప్పడం గమనార్హం.
“థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ” అనేది తమ నినాదమని సీఎం వివరించారు. దీని ప్రకారమే ఆరు పాలసీలకు.. రూపకల్పన చేసి తాజాగా జరిగిన మంత్రివర్గంలో ఆమోదించినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త ఎదగాలన్నది తమ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి ప్రజలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. నాలెడ్జ్ ఎకానమీ, అగ్రికల్చర్, ఆక్వా, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు రాష్ట్రానికి వరంగా మారాయని చంద్రబాబు తెలిపారు. వీటిని ప్రోత్సహించడం ద్వారా ఆదాయానికి బాటలు వేస్తున్నట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates