ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాలకు తరలి వెళ్లారు. అయితే.. వాస్తవానికి ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్యక్తం చేస్తారు. తమ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన.. యువ ఐఏఎస్‌లు మాత్రం అయిష్టంగానే ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రిపోర్టు చేశారు. వీరికి రేపో మాపో.. జిల్లాలు, లేదా శాఖలను ప్రభుత్వాలు కేటాయించనున్నాయి.
ఎవరెవరు?
- ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన ఐఏఎస్‌లలో సృజన(ప్రస్తుతంఎన్టీఆర్ జిల్లా కలెక్టర్), హరికిరణ్(విజయనగరం), లోతోటి శివశంకర్ (కడప) ఉన్నారు. వీరు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని కలిసి రిపోర్టు చేశారు.
- తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన వారిలో వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రిపోర్టు చేశారు.
ఫలించని పోరాటం!
కాగా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఐఏఎస్, ఐపీఎస్‌లను ఏపీ, తెలంగాణకు కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) అప్పట్లోనే పూర్తి చేసింది. అయితే.. వీరు మాత్రం తమకు నచ్చిన రాష్ట్రంలో కొనసాగుతున్నారు. దీనికి ప్రభుత్వాలు అప్పట్లో సహకరించారు. కానీ, కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టులో నమోదైన కేసు విచారణ కారణంగా.. ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని ఆదేశించింది. ఈ విషయంపై డీవోపీటీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిన డీవోపీటీ కేటాయించిన వారు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఎక్కడివారు అక్కడకు వెళ్లాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీనిని సదరు ఐఏఎస్‌లు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయినా.. పోరాటం ఫలించలేదు. దీంతో ఏపీకి చెందిన వారు తెలంగాణ నుంచి, తెలంగాణకు చెందిన వారు ఏపీ నుంచి రిలీవ్ అయి.. ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేశారు.