టీడీపీ నేత, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దు.. అనంతర పరిణామాల్లో తాజాగా సంచలన ఘట్టం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో ఎంపీగా ఉన్న సమయంలో తనను సీఐడీ అధికారులు నిర్బంధించి.. కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారని.. తనను చంపేందుకు కూడా కృట్ర పన్నారని రఘురామ ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.
దీంతో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సహా.. గుంటూరు డీఎస్పీగా ఉన్న విజయపాల్‌పై కేసులు నమోదు చేశారు. వీరితోపాటు మరో సీనియర్ అధికారి సీతారామాంజనేయులుపై కూడా కేసు నమోదు చేశారు. అయితే.. వీరిని విచారించేందుకు పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నాటి సీఐడీ స్టేషన్లలో పనిచేసి పోలీసులను, ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. కానీ, రఘురామను ఎవరు కొట్టారనే విషయం మాత్రం తెలియరాలేదు.
దీనిని తెలుసుకోవాలంటే.. అప్పటి డీఎస్పీగా ఉన్న విజయపాల్(ప్రస్తుతం రిటైరయ్యారు)ను విచారించా లన్నది పోలీసుల ఉద్దేశం. అయితే.. విచారణ పేరుతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన విజయపాల్.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు దీనికి అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం విజయపాల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తనకు నాటి సంగతులు గుర్తులేదని, అన్నీ మరిచిపోయారని చెబుతున్నారు.
ఇదిలావుంటే.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజయపాల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం తొలి కేసుగా ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. సంచలన ఆదేశాలు చేసింది. విజయపాల్‌పై ఎలాంటిదురుసు ప్రవర్తన చేయరాదని తెలిపింది. ఆయనను విచారిస్తున్నట్టు తెలుసుకున్న సుప్రీంకోర్టు.. ఆయన తరఫు న్యాయవాదిని కూడా విచారణలో భాగంగా మార్చాలని తెలిపింది. ఎలాంటిఅరెస్టులు, హెచ్చరికలు చేయరాదని తేల్చిచెప్పింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు.. ఆయనకు రక్షణగా ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా కేటాయించాలని ఆదేశించడం గమనార్హం.