ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి సాఫ్ట్ కార్నర్ ఉన్న శర్వానంద్ వాళ్ళ కోసమే సినిమా చేస్తే దాని మీద ప్రత్యేక అంచనాలు నెలకొంటాయి. రెండేళ్ల క్రితం ఒకే ఒక జీవితంతో మంచి విజయం అందుకున్నాక గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినప్పటికీ మనమే మీద ముందు నుంచి బలమైన నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చడం అంచనాలు పెంచింది. మరి హోమ్లీ టైటిల్ తో మన ముందుకొచ్చిన మనమే ఎలా ఉందంటే
కథ
లండన్ లో ఉండే విక్రమ్ (శర్వానంద్) సరదాగా జీవితాన్ని గడుపుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రాణ స్నేహితుడు చనిపోవడంతో అతని కొడుకు ఖుషి(మాస్టర్ విక్రమ్ ఆదిత్య) బాధ్యత ఇష్టం లేకపోయినా తన మీద పడుతుంది. పరిచయమే లేని సుభద్ర (కృతి శెట్టి) తో కలిసి ఒకే ఇంట్లో బాబుని కొంత కాలం పాటు పెంచాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అప్పటికే పెళ్లి ఫిక్సయిన సుభద్రతో పాటు ఖుషి మీద విక్రమ్ కు క్రమంగా బాండింగ్ ఏర్పడుతుంది. ఇదో కొత్త సమస్యను తెచ్చి పెడుతుంది. ఈ క్రమంలో వీళ్ళ లైఫ్ లో ఊహించని అతిథి (రాజ్ కందుకూరి) అడుగు పెడతాడు. ఇంతకీ ఈ నలుగురి ప్రయాణం ఎక్కడికి దారి తీసిందనేదే అసలు స్టోరీ
విశ్లేషణ
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటిదాకా చేసినవి ఎక్కువ యాక్షన్ లేదా క్రైమ్ కమర్షియల్ డ్రామాలు. మొదటిసారి పూర్తి ఎమోషన్స్ మీద నడిచే సబ్జెక్టుని మనమేలో రాసుకున్నాడు. చైల్డ్ సెంటిమెంట్ తో ఒక ప్రేమకథను ముడిపెట్టడం మంచి ఆలోచన. కాకపోతే దానికి సరైన ముడిసరుకుడు పడాలి. ముఖ్యంగా ఫన్ విషయంలో. లీడ్ పెయిర్ అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. సరైన పాళ్ళలో వినోదం పండితేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సిసింద్రీలో మాస్టర్ అఖిల్ కు మాటలు రాకపోయినా సన్నివేశాల్లోని బలంతో పాటు చుట్టూ ఉన్న క్యారెక్టర్లు నవ్వించే బాధ్యతను తీసుకోవడంతో టైటిల్ రోల్ పాత్రధారి కేవలం ఎక్స్ ప్రెషన్లకే పరిమితమైనా మెప్పించింది.
మనమే ప్రధాన ఉద్దేశంలో రెండు సందేశాలున్నాయి. తల్లితండ్రులకు దూరంగా ఉండే పిల్లలు తాము ఏం కోల్పోతున్నామో తెలుసుకోవడం మొదటిది. ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు దేహ ఆక్షరణకు దూరంగా గొప్ప మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చనేది రెండోది. వీటిని బ్యాలన్స్ చేసే క్రమంలో శ్రీరామ్ ఆదిత్య వేసిన ఎంటర్ టైన్మెంట్ పూత తాలూకు మోతాదు సరిపోక కథనం ముందుకు నడిచే కొద్దీ ఒక మాములు కంటెంట్ గా మారిపోయింది. ఖుషితో విక్రమ్, సుభద్రలు బంధాన్ని ఏర్పరుచుకునే క్రమం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఏదైనా ప్రత్యేక ముద్ర లేదా హృదయాన్ని తాకేలా ఏ ఎపిసోడ్ లేకపోవడం ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన ప్రధాన లోపం.
రాహుల్ రవీంద్రన్ విలనిజం, శర్వా ఫ్రెండ్ మీద అతనికున్న అక్కసు, ఖుషిని చంపించె ప్రయత్నాలు ఇవన్నీ మరీ పాత ఫార్ములాలో వాడేశారు. అవసరం ఉన్నా లేకపోయినా వచ్చే బిట్ సాంగ్స్, పూర్తి పాటలు మరీ మేజిక్ చేసే స్థాయిలో లేవు. తొలి సగంలో కామెడీ, చిన్న చిన్న జోకులుతో టైం పాస్ జరిగినా కూడా ఎగ్జై టింగ్ గా అనిపించేది ఏదీ ఇంటర్వెల్ దాకా కనిపించదు. అక్కడొచ్చే ట్విస్టు కూడా ఊహించేలానే ఉంటుంది. కృతి శెట్టి ఇంట్రో జరిగిన కాసేపటికే ఆమెకు ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని బయట పెట్టేశారు కాబట్టి విశ్రాంతికిచ్చే మలుపు మాములుగా అనిపిస్తుంది. రాజ్ కందుకూరి ఎంట్రీ ఇచ్చాక ఏం జరగబోతోందో ముందే ఊహించేలా సెట్ చేశారు.
కీలకమైన సెకండాఫ్ లో ఖుషిని పూర్తిగా తగ్గించేసి విక్రమ్, సుభద్రల ప్రేమకథను మొదలుపెట్టిన శ్రీరామ్ ఆదిత్య దాన్ని రెగ్యులర్ టెంప్లేట్ లో నడిపించారు. సహజంగా కాకుండా కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు కనిపించడంతో వాళ్ళ ఎమోషన్ ని మనం ఫీల్ కాము. పట్టుమని మూడేళ్లు లేని చిన్న బాబు దూరమవుతున్నప్పడు, ఆ బాధని చూసే ఆడియన్స్ ఫీలైతేనే దర్శకుడి లక్ష్యం నెరవేరుతుంది. అంతే తప్ప కొన్ని వందల సినిమాల్లో చూసిన క్లైమాక్స్ తరహాలో రెగ్యులర్ గా నడిపించేసి హీరో హీరోయిన్ కి బాబు అంటే ప్రాణం అంటే సరిపోదు. ఇది సరిగా అర్థం కావాలంటే పసివాడి ప్రాణం, డాడీ కాలం నుంచి హాయ్ నాన్న దాకా బోలెడన్ని ఉదాహరణలు చెప్పొచ్చు.
సీనియర్ నటులు విజయ్ కుమార్ లవ్ ట్రాక్, బెలూన్ ఫెస్టివల్, ఖుషితో కలిసి విక్రమ్ గ్యాంగ్ రోడ్ ట్రిప్, బాబు అమ్మమ్మ తాతయ్యల థ్రెడ్ ఇవన్నీ అలా వచ్చి ఇలా వెళ్తాయి తప్పించి ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వకపోవడం భారంగా క్లైమాక్స్ కోసం ఎదురు చూసేలా చేసింది. పాత్రల మధ్య సంబంధాలు సరిగా ఎస్టాబ్లిష్ కాకుండా కేవలం సన్నివేశాలు, డైలాగుల మీద ఆధారపడితే అవుట్ ఫుట్ తేడా కొట్టేస్తుంది. చివర్లో తులసి, సచిన్ కెడ్కర్ లు తామేం కోరుకుంటున్నామో శర్వాను వివరించే తీరు అందుకే హత్తుకునేలా అనిపించదు. మరెలా చెప్పాలని అడిగితే శతమానం భవతిని గుర్తు చేయాల్సి ఉంటుంది. ఇది శ్రీరామ్ కేవలం సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ వల్ల జరిగిన పొరపాటు.
టెక్నికల్ గా మనమేలో మంచి విషయాలున్నాయి. లండన్ విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చాయి. కారు ఛేజ్ ఫైట్ లాంటి చోట్ల విఎఫెక్స్ కొంచెం తేడా కొట్టినప్పటికీ ఓవరాల్ గా క్వాలిటీ చాలా కలర్ ఫుల్ గా ఉంది. శ్రీరామ్ ఆదిత్య అభిరుచి దర్శకుడిగా కనిపిస్తుంది కానీ ఆయనలో రచయిత బలహీనమైపోవడంతో కేవలం సాంకేతిక బలం సరిపోలేదు. ఇంకొంత వర్క్ జరిగి ఉంటే స్థాయి పెరిగేది. అయినా సరే ఈ మాత్రం కాసింత వినోదం, అసభ్యత లేని విషయం ఉన్న సినిమాలు వచ్చి నెలలు గడిచిపోయాయి కాబట్టి ఓపిక తెచ్చుకుని మరీ చూస్తామంటే కుటుంబ ప్రేక్షకులకు వన్ టైం వాచ్ అనిపించవచ్చు. అలా అయితేనే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుంది.
నటీనటులు
శర్వానంద్ చాలా ఈజ్ తో మెప్పించేశాడు. చలాకీతనం, తింగరితనం రెండూ కలిసి చివరి అరగంటకు కావాల్సిన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ని కోరుకున్నట్టు ఇచ్చాడు. కృతి శెట్టి అందంగా ఉంది. నటన పరంగా గొప్పగా చెప్పడానికేం లేదు. మరీ బుడిబుడి అడుగుల వయసు కావడంతో విక్రమ్ ఆదిత్యని ఎక్కువగా విశ్లేషించలేం. వెన్నెల కిషోర్ ని రెండు సీన్లకు పరిమితం చేశారు. రీల్స్ కామెడీతో రాహుల్ రామకృష్ణ నవ్వించలేకపోయాడు. రాహుల్ రవీంద్రన్, తులసి, విజయ్ కుమార్, సచిన్ కెడ్కర్, సుదర్శన్ అందరివీ రొటీన్ బాపతు. అయేషా ఖాన్, సీరత్ కపూర్ కొంచెం గ్లామర్ టచ్ ఇచ్చారు. రాజ్ కందుకూరిది ఎన్నోసార్లు చూసిన పాత్రే.
సాంకేతిక వర్గం
పదహారు పాటలని ఊదరగొట్టారు కానీ హేశం అబ్దుల్ వహాబ్ మనమేలో ఆశించిన మేజిక్ చేయలేకపోయాడు. ఒకటి రెండు బాగున్నా మిగిలినవి సోసోగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకదశ దాటాక ఎలాంటి స్పెషల్ ఫీలింగ్ ఇవ్వదు. జ్ఞానశేఖర్ విఎస్ – విష్ణు శర్మ కెమెరా పనితనం బాగుంది. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిని లండన్ సాక్షిగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎవరు ఏ భాగం తీశారో చెప్పలేదు కానీ వంక పెట్టే ఛాన్స్ ఇవ్వలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సెకండాఫ్ మీద ఇంకొంత సీరియస్ గా పదును పెట్టాల్సింది. ఆర్ట్ వర్క్ బాగున్నా కొన్ని చోట్ల రాజీపడినట్టు దొరికేలా చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్
శర్వానంద్ నటన
విజువల్స్
క్లీన్ కంటెంట్
నెగటివ్ పాయింట్స్
ఎక్కువైన పాటలు
అతకని ఎమోషన్స్
బలమైన కాంఫ్లిక్ట్ లేకపోవడం
తేలికైన కథా కథనాలు
ఫినిషింగ్ టచ్ : బరువు తగ్గిన భావోద్వేగం
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on June 7, 2024 1:30 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……