2.25/5
2 Hr 10 Mins | Patriotic | 01-03-2024
Cast - Varun Tej, Manushi Chhillar, Navdeep, Mir Sarwar
Director - Shakti Pratap Singh Hada
Producer - Sony Pictures, Sandeep Mudda
Banner - Sony Pictures, Renaissance Pictures
Music - Mickey J. Meyer
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఒకప్పుడు ఫిదా లాంటి బ్లాక్ బస్టర్స్ తో మార్కెట్ స్థిరపరుచుకుంటున్న టైంలో ప్రయోగాలు ట్రై చేద్దామని చూస్తే ఒక్క గద్దలకొండ గణేష్ మాత్రమే డీసెంట్ ఫలితం అందివ్వగా మిగిలినవి తీవ్రంగా నిరాశ కలిగించాయి. అందుకే ఆపరేషన్ వాలెంటైన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏదో ఆషామాషీగా ప్రమోట్ చేయకుండా ముంబై నుంచి హైదరాబాద్ దాకా తెగ తిరిగి మరీ పబ్లిసిటీలో భాగమయ్యాడు. ఇంతగా పెట్టుకున్న నమ్మకం నిలిచిందా.
కథ
ఎయిర్ ఫోర్స్ లో రాడార్ ఆఫీసర్ గా పని చేసే అర్జున్ దేవ్(వరుణ్ తేజ్)కు దూకుడెక్కువ. తక్కువ ఎత్తులో మిసైల్స్ నడిపి శత్రువులను చావు దెబ్బ తీసే ప్రాజెక్ట్ రుద్రని అమలు చేసే క్రమంలో స్నేహితుడిని కోల్పోతాడు. అందుకే ట్రాక్ రికార్డులో రెడ్ ఫ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి. సహచరి అహనా(మానుషీ చిల్లార్)తోనే ప్రేమ, సహజీవనం అన్నీ. శత్రుదేశం పాకిస్థాన్ చేసిన ఒక అనూహ్య దాడి వల్ల జవాన్లు, అమాయక పౌరులు ప్రాణాలు పోగొట్టుకోవడంతో అర్జున్ దేవ్ రంగంలోకి దిగుతాడు. ఆపరేషన్ వాలెంటైన్ పేరుతో తన బృందంతో కలిసి ప్రమాదరకరమైన ఎయిర్ స్ట్రైక్ కి సిద్ధపడతాడు. చివరికి ఎలా గెలిచాడనేది తెరమీద చూడాల్సిన స్టోరీ
విశ్లేషణ
దేశభక్తిని రంగరించే సబ్జెక్టుని ఎంచుకున్నప్పుడు దాన్ని సరైన రీతిలో కనెక్ట్ చేసే ఎమోషన్ చాలా అవసరం. టీవీలో క్రికెట్ చూస్తూ ఆడియన్స్ భావోద్వేగానికి ఎందుకు గురవుతారంటే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పదకొండు ప్లేయర్లు మన జెండా ఎగరేయాలనే సంకల్పం. అయితే ఈ తరహాలో వాయు దళం నేపధ్యాలు అంత సులభంగా కనెక్ట్ కావు. కారణం యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి. అయినా సరే దాన్ని తెరమీద చూపించాలంటే రీసెర్చ్ చేస్తే సరిపోదు. సినిమాటిక్ ఫ్లేవర్ అద్ది క్లాసు, మాసు ఇద్దరికీ నచ్చేలా సరైన ట్రీట్ మెంట్ తో స్క్రీన్ ప్లే రాసుకోవడం. ఆపరేషన్ వాలెంటైన్ లో ఇది పూర్తిగా కొరవడింది.
పుల్వామా దాడులు, దానికి ప్రతిగా మనం చేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా దాన్ని గ్రిప్పింగ్ గా చెప్పడంలో తడబడ్డాడు. అర్జున్ దేవ్ క్యారెక్టరైజేషన్ తో మొదలుపెట్టి అతని మీద పై అధికారులు ఎందుకంత ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారన్న విషయాన్ని రిజిస్టర్ చేసే దాకా దేని మీదనా సరైన హోమ్ వర్క్ జరగలేదు. అసలు అర్జున్ పని చేసే వాతావరణమే చాలా డల్ గా ఉంటుంది. పై ఆఫీసర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ఏ పాత్రా కనీస స్థాయిలో మెప్పించేలా డిజైన్ చేయలేదు. క్యారెక్టర్ల మధ్య లింకులు ఎంత బలహీనంగా ఉన్నాయంటే అర్జున్, అహనాలు లవర్సా భార్యాభర్తలా అర్థం కాదు.
ఎప్పుడో జెపి దత్తా తీసిన బోర్డర్ లో గంటన్నర పాటు ఎడారిలో జరిగే యుద్ధ సన్నివేశాలే ఉంటాయి. అయినా సరే ప్రేక్షకులు ఊగిపోయారు. రోజాలో అరవింద్ స్వామి భారతదేశ జెండా మీద పడిన నిప్పు ఆర్పే సీన్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అలాంటి గూస్ బంప్ మూమెంట్స్ వాలెంటైన్ లో మచ్చుకు కూడా కనిపించవు. ఏదో టీవీ సీరియల్ తరహాలో ఇండియా పాకిస్థాన్ మధ్య వార్ కు సంబంధించిన ఎపిసోడ్లను తీర్చిదిద్దిన తీరు శక్తి ప్రతాప్ వీక్ రైటింగ్ ని తేటతెల్లం చేస్తుంది. ఆలోచనలో ఎంత నిజాయితీ ఉన్నా ఆచరణలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇంటర్వెల్ ముందు వరకు అసలు ఎవరేం చేస్తున్నారో ఆసక్తే పుట్టనంత వీక్ గా సాగుతుంది.
శత్రు స్థావరాలపై దాడి లక్ష్యంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఇక్కడ గంట సేపు ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలంటే కేవలం వార్ రూమ్ నుంచి సిగ్నల్స్ ఇస్తూ, ఆర్డర్స్ వేస్తూ ఉంటే సరిపోదు. అర్జున్ దేవ్ వేసే ఎత్తులు, పాక్ కమాండర్ దాడి చేసే పద్దతులు ఏవీ ఎగ్జైటింగ్ గా అనిపించవు. దీంతో ఏదో బిబిసి డాక్యుమెంటరీ తరహా ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే లైవ్ కామెంటరీ ఉండదు అదొక్కటే తేడా. ఆకాశంలో జరిగే దాడులు, ప్రతిదాడులు చప్పగా ఉండటమే కాక సరిపడా డ్రామా లేకపోవడంతో ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికారు అనే అయోమయంలోనే క్లైమాక్స్ వచ్చేస్తుంది. అక్కడా ఏదో ట్విస్టు పెట్టబోయి ఎమోషనల్ టచ్ ఇద్దామనుకున్నా పండలేదు.
ఇటీవలే వచ్చిన ఫైటర్ ఈ ఆపరేషన్ వాలెంటైన్ రెండు చూసినవాళ్లకు చాలా పోలికలు కనిపిస్తాయి. దానికీ కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా యావరేజ్ కంటెంట్ ని మరీ విసుగు రాకుండా హ్యాండిల్ చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యేలా చేసింది. కానీ ఇందులో అది పూర్తిగా కొరవడింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లను పరిమిత బడ్జెట్ లో తీసిన తీరు బాగానే ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ లో రాజీ పడటం వల్ల చాలా చోట్ల క్వాలిటీ తేలిపోయింది. ఖర్చు పెట్టే అవకాశం లేక కాంప్రమైజ్ అయినా సరే చూసేవాళ్ళు కన్విన్స్ అయ్యేలా, వావ్ అనిపించేలా తీయగలగాలి. లేదంటే ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక్కడ జరిగింది అదే.
నటీనటులు
వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఫిజిక్ పరంగా అతని ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఉన్నంతలో డీసెంట్ అనిపించాడే తప్ప అర్జున్డ్ దేవ్ బెస్ట్ గా నిలిచిపోయే పాత్ర కాదు. మానుషీ చిల్లార్ లుక్స్ ఓకే. యాక్టింగ్ పరంగా రెండు మూడు ఎక్స్ ప్రెషన్లు రాబట్టుకుని మమ అనిపించారు. నవదీప్ ఎడిటింగ్ లో ఎగిరిపోయాడనిపించింది. ఆలా వచ్చి వెళ్లిపోవడం చూస్తే కోతకు గురైనట్టే. రుహాని శర్మ పూర్తిగా వృథా అయ్యింది. సంపత్ రాజ్, అలీ రెజా కేవలం మూడు నాలుగు సీన్లకు పరిమితం. టెర్రరిస్టుల పాత్రలకు తీసుకున్న ఆర్టిస్టులు హిందీ బ్యాచ్ కావడంతో ప్రత్యేకంగా ఎవరూ గుర్తుండరు.
సాంకేతిక వర్గం
మిక్కీ జె మేయర్ సంగీతం ఎలాంటి ప్రభావం చూపించలేదు. పాటలు సోసో అనుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే సాగింది. కొన్ని సీన్లలో ఛాన్స్ ఉన్న వాడుకోలేదు. హరి కె వేదాంతం ఛాయాగ్రహణం స్టాండర్డ్ లోనే ఉంది. విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం పర్వాలేదు. నవీన్ నూలి ఎడిటింగ్ నిడివిని రెండుంపావు గంటల లోపే నియంత్రించడం మంచి పనే. అయినా ల్యాగ్ ఉందంటే బాధ్యత ఈయనది కాదు. సాయి మాధవ్ బుర్రా పెన్నుకు పెద్దగా పని ఇచ్చినట్టు లేరు. కొన్ని చోట్ల హిందీ డైలాగులకే తెలుగు లిప్ సింక్ కనిపిస్తుంది. యాక్షన్ బ్లాక్స్ ఓకే. గిరిగీసుకుని పెట్టుకున్న నిర్మాణ విలువలు నాణ్యత మీద ప్రభావం చూపించాయి
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న నేపథ్యం
ఆలోచనలో నిజాయితీ
మైనస్ పాయింట్స్
రగలని దేశభక్తి ఎమోషన్
సంగీతం
విఎఫ్ఎక్స్ క్వాలిటీ
నాటకీయత లేని కథనం
ఫినిషింగ్ టచ్ : పని చేయని రాడార్
రేటింగ్ : 2.25/5