Movie Reviews

సమీక్ష – గుంటూరు కారం

ప్యాన్ ఇండియా జోలికి వెళ్లకుండా కేవలం ఒక భాష రిలీజ్ తోనే ఆ రేంజ్ హైప్ తెచ్చుకోవడం మహేష్ బాబు లాంటి అతి కొందరు స్టార్లకే సాధ్యం. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే చెప్పేదేముంది. అందుకే గుంటూరు కారం మీద షూటింగ్ టైం నుంచే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అవి ఈ స్థాయిలో ఉన్నాయో అడ్వాన్స్ బుకింగ్ లోనే అర్థమైపోయింది. అర్ధరాత్రి ప్రీమియర్లకు సైతం టికెట్లు దొరకలేదంటే క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత బజ్ మోసుకొచ్చిన గుంటూరు కారం దానికి తగ్గట్టు ఉందా లేదా

కథ

చిన్నప్పుడే ఓ ప్రమాదం వల్ల తల్లి వసుంధర(రమ్యకృష్ణ)తనను వదిలేసి వేరే పెళ్లి(రావు రమేష్) చేసుకోవడంతో వెంకటరమణ(మహేష్ బాబు) విడిగా గుంటూరు వెళ్ళిపోయి తండ్రి సత్యం(జయరామ్), మేనమామ దగ్గర పెరుగుతాడు. మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. తాత వెంకటస్వామి(ప్రకాష్ రాజ్) రాజకీయ ప్రయోజనాల కోసం మనవడితో ఎలాంటి సమస్య రాకూడదని తమ కుటుంబంతో సంబంధం లేదని రాసిమ్మని రాయబారం నడుపుతూ ఉంటాడు. అమ్మను కలవాలన్న తాపత్రయం ఉన్న వెంకరమణ తన దూకుడు స్వభావంతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో అమ్ములు(శ్రీలీల)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏం జరిగిందో తెరమీద చూడాలి.

విశ్లేషణ

త్రివిక్రమ్ శ్రీనివాస్ బలమంతా ఆయన కలంలోనే ఉంటుంది. ఇప్పటిదాకా దాని సహాయంతోనే తనలో దర్శకుడు ఒకేసారి పది మెట్లు ఎక్కే స్థాయికి చేరుకున్నాడు. మహేష్ బాబుతో అతడు, ఖలేజా రూపంలో విభిన్న ప్రయోగాలు చేసిన మాటల మాంత్రికుడు ఈసారి తన మార్కు వదలకుండా పూర్తిగా కమర్షియల్ జోన్ లోకి వెళ్ళిపోయి సేఫ్ గేమ్ ఆడాలని ఈ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఎమోషన్ల మీద విపరీతంగా ఆధారపడుతూ తన సబ్జెక్టులు తనే రిపీట్ చేస్తున్న బలహీనతని గుర్తించలేకపోయారు. హీరోకు ఫ్యామిలీతో ఒక సమస్య రావడం, ముఖ్యమైన పాత్రలు విడిపోయి ఎక్కడో దూరంగా ఉండటమనే బ్యాక్ డ్రాప్ క్రమం తప్పకుండా వాడుతూ ఇందులోనూ అదే చేశారు.

సంవత్సరాల తరబడి కన్న కొడుకుని ఒక తల్లి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందనే సరిగా ఎస్టాబ్లిష్ చేయకుండా నేరుగా మెయిన్ పాయింట్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఒక గంట దాకా పెద్దగా ఇబ్బంది లేకుండా నడిపించాడు. మరీ అదరహో అనే స్థాయిలో ఉండదు కానీ విసుగు రాకుండా పని కానిచ్చేశాడు. ముఖ్యంగా మహేష్ ని ఇంత చలాకీగా చూస్తున్న ఆనందం ఎన్నో తప్పులను కవర్ చేసుకోవడంతో కాలక్షేపానికి అంతగా లోటు రాలేదు. ఎప్పుడైతే తాత మనవడి మధ్య ఘర్షణ మొదలైందో అక్కడి నుంచి స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాలి. కానీ త్రివిక్రమ్ దాని జోలికి వెళ్ళలేదు. సన్నివేశాలు పేర్చుకుంటూ పోయారు కానీ వాటి మధ్య లింకులు బలంగా లేవు.

వెంకటరమణ సంతకం కోసం వెంకటస్వామి తీవ్ర ప్రయత్నాలు చేయడం బాగానే రిజిస్టర్ చేసినప్పటికీ తర్వాత దీన్ని శ్రీలీల ఎంట్రీతో సిల్లీగా మార్చేయడంతో ఆడియన్స్ తో కనెక్షన్ తగ్గడం మొదలవుతుంది. జగపతి బాబుకి అంత బిల్డప్ ఇచ్చి అతన్నో జోకర్ గా తప్పించేయడంతో మహేష్ బాబుకి జోకులు వేస్తూ, శ్రీలీలకు లైన్ వేయడం తప్ప పెద్దగా పనేం లేకపోయింది. ఇంటర్వెల్ కు ముందు వసుంధర ఇంటికి వెళ్లి చేసే గొడవ కాసింత ఆసక్తి రేపినప్పటికీ సెకండ్ హాఫ్ లో పూర్తిగా ట్రాక్ తప్పేశారు. చేతిలో గంటంపావుకు సరిపడా కంటెంట్ లేకపోవడంతో సింపుల్ గా ముగించాల్సి ఎపిసోడ్లను సాగదీసుకుంటూ వెళ్లారు. అజయ్ ఘోష్ ట్రాక్ ఓ ఉదాహరణ.

అజ్ఞాతవాసిలో తండ్రి చనిపోయాక సవితి తల్లి అండగా నిలబడేందుకు కొడుకు వచ్చిన క్రమాన్ని ఎలాగైతే సరిగా హ్యాండిల్ చేయలేదో గుంటూరు కారంలోనూ అలాంటి పొరపాట్లు రిపీట్ చేశారు త్రివిక్రమ్. ఆల వైకుంఠపురములో పండిన డ్రామా ఇక్కడ ఫెయిలయ్యింది. అందులో సవాల్ చేసేందుకు సముతిరఖని లాంటి పవర్ ఫుల్ ప్రతినాయకుడు ఉన్నాడు. కానీ ఇక్కడ తాతనే విలన్ గా మార్చడంతో హీరో చేతులు కట్టేసినట్టు అయ్యింది. అదేదో గొప్ప ట్విస్టు అయినట్టు వసుంధర వెంకటరమణని ఎందుకు దూరంగా పెట్టిందో నాన్చి నాన్చి బయట పెట్టడం ఏ మాత్రం కన్విసింగ్ గా లేదు. పైగా ప్రీ క్లైమాక్స్ లో చెప్పిన రావు రమేష్ వెర్షన్ కన్ఫ్యూజన్ కి దారి తీసింది.

రాజకీయం, కుటుంబం రెండు వేర్వేరు అంశాలను కలిపి భావోద్వేగాలను పండించాలని అనుకున్నప్పుడు కేవలం హీరో మ్యానరిజం, టైమింగ్ మీద ఆధారపడకూడదు. బలమైన స్టోరీ ఉంటే దాన్ని మరింత పైకి తీసుకెళ్లేందుకు అవి ఉపయోగపడతాయి తప్ప పెట్రోల్ లేని బండిని వంద స్పీడ్ లో పరిగెత్తించలేవు. పదే పదే వెంకటరమణతో గుంటూరు టు హైదరాబాద్ ట్రిప్పులు కొట్టించిన త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైన మొదట్లో తప్ప తర్వాత సహేతుకమైన కారణాలు చూపించలేదు. ఊరికే డాన్సులు, ఫైట్లు పెట్టేసుకుంటూ పోయి మధ్యలో హఠాత్తుగా మలుపు పెట్టేసి ఎమోషన్ ఫీలవ్వడమంటే జరగని పని. మహేష్ రమ్యకృష్ణల బాండింగ్ అందుకే సింకవ్వలేదు.

జనాల్లో ఒక కాంబినేషన్ మీద గౌరవంతో అంచనాల బరువు అధికంగా ఉన్నప్పుడు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. కానీ గుంటూరు కారంలో దీనికి న్యాయం జరగలేదు. పండగ సీజన్, మహేష్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ వల్ల మొదటి నాలుగైదు రోజులు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఫైనల్ గా తర్వాత ముందుకు తీసుకెళ్లేది మాత్రం టాకే. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ నుంచి ఎదురు చూసిన అవుట్ ఫుట్ అయితే ఇది కాదు. ఈ మధ్య తన సినిమాల్లో సందేశాలు ఎక్కువైపోయాయని పూర్తిగా కమర్షియల్ రూటు తీసుకున్న మహేష్ బాబు తన బాధ్యతకు వందకు రెండు వందల శాతం న్యాయం చేశాడు కానీ త్రివిక్రమ్ వైపు పనితనం యాభై శాతంలోపే ఆగిపోయింది.

నటీనటులు

మహేష్ బాబు ఎనర్జీ కట్టిపడేస్తుంది. ఒక పక్క కామెడీ టైమింగ్, ఇంకోవైపు హుషారెత్తిపోయే డాన్సులతో అభిమానుల ఆకలిని తీర్చాడు. లుక్స్ లో యంగ్ గా కనిపించడమే కాక యాక్టింగ్ లోనూ యూత్ గా మారిపోయి అదరగొట్టాడు. ఇది తనకు వన్ మ్యాన్ షో. శ్రీలీల నృత్యాలతో మాస్ కి కనెక్ట్ అయిపోయింది. పాత్ర పరంగా రొటీనే. మీనాక్షి చౌదరి ఎందుకు ఉందో అర్థం కాదు. మొక్కుబడి మరదలిగా మమ అనిపించారు. ప్రకాష్ రాజ్ అలవాటైన రీతిలో ముసలి విలనిజం పండించారు. రమ్యకృష్ణ, రావు రమేష్, ఈశ్వరి రావు, రఘుబాబు, జయరాం, జగపతిబాబు, వెన్నెల కిషోర్, మురళి శర్మ, రవిశంకర్, అజయ్ ఘోష్, తదితరులందరివీ రెగ్యులర్ పాత్రలే. సునీల్ కొన్ని సెకండ్లే.

సాంకేతిక వర్గం

తమన్ నుంచి ఎంతో ఆశిస్తే కనీసం సగం అంచనాలు అందుకోలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేలిపోయింది. చాలా చోట్ల గతంలో విన్నట్టే అనిపించే బీజీఎమ్ ఇచ్చాడు. కుర్చీ మడతపెట్టి తప్ప పాటలు సోసోగానే ఉన్నాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణంలో అనుభవం తొంగిచూసింది. తక్కువ లొకేషన్లలో రిచ్ నెస్ వచ్చేలా చేయడంలో ఈయన పనితనం ప్రత్యేకం. నవీన్ నూలి ఎడిటింగ్ లో కొన్ని కత్తెర్లు పడాల్సింది. అవసరమున్న చోట ట్రిమ్ చేసే ఛాన్స్ ఉన్నా వదిలేశారు. ఫైట్స్ బాగానే ఉన్నాయి. డైలాగుల్లో ప్రాసలున్నాయి కానీ మెరుపుల్లేవ్. హారికా హాసిని నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ ఏదో లోటు జరిగిన ఫీలింగ్ కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్

మహేష్ బాబు ర్యాంపేజ్
శ్రీలీల డాన్సులు
ఫస్ట్ హాఫ్ కొంత

మైనస్ పాయింట్స్

పండని ఎమోషన్లు
అక్కర్లేని సెంటిమెంట్ ట్విస్టులు
పాటలు
సెకండాఫ్

ఫినిషింగ్ టచ్ : ఘాటు లేని కారం

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on January 12, 2024 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

8 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

8 hours ago